వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలో కరోనా కలకలమంటూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. మంగళవారం వివిధ సామాజిక మాధ్యమాలలో వరంగల్ నగరం నడిబొడ్డున, ఎంజీఎం హాస్పిటల్కు కూతవేటు దూరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ తేలిందంటూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దాంతో ఒక్కసారిగా నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గత కరోనా రోజులను గుర్తు చేసుకుంటూ అలాంటి రోజులు మళ్లీ రాబోతున్నాయానని ఆవేదనకు గురయ్యారు.
ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులను వివరణ కోరగా ఇప్పటి వరకు నగరంలోగాని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తేల్చిచెప్పేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు కాలేదని అన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలను నమ్మవద్దని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన సోషల్ మీడియా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.