భీమదేవరపల్లి, జూలై 19: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచాలని హన్మకొండ డీఎంహెచ్వో అప్పయ్య అన్నారు. శనివారం భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచడంతోపాటు, ఎన్ సీడీ రీస్క్రీనింగ్ మొదలు పెట్టాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైపర్ టెన్షన్ డయాబెటిస్ రోగులకు సక్రమంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని తప్పక నిర్వహించాలని చెప్పారు.
అనంతరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కుక్క కాటు, టీటీ సూది మందులు అందుబాటులో ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వంగర, ముల్కనూరు, వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 150 మందికి ముల్కనూరు సుధాకర్ మెమోరియల్ ప్రైవేట్ హాస్పిటల్లో టీబీ పరీక్షలు ఉచితంగా నిర్వహించిన డాక్టర్ సుధాకర్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అంతకుముందు వీర్లగడ్డ తండాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ముల్కనూరు ప్రభుత్వ వైద్యాధికారులు ప్రదీప్, నివేదిత, హెల్త్ అసిస్టెంట్ రాజు, ఏఎన్ఎంలు అనిత, గీత, ఆశా కార్యకర్తలు భాగ్య, సునిత, రాజ కొమురమ్మ తదితరులు పాల్గొన్నారు.