ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గులాబీ సైన్యం సేవా కార్యక్రమాలు జోరుగా నిర్వహించింది. వేడుకలను మూడు రోజులు పండుగ వాతావరణంలో నిర్వహించాలనే పిలుపుమేరకు తొలిరోజు మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నదానాలు, పండ్లు, దుప్పట్లు, ట్రైసైకిళ్లు పంపిణీ చేసింది. దేవరుప్పుల, పెద్దవంగర, రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొనగా, హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్.. దివ్యాంగులతో కేక్ కట్ చేయించి వారిలో సంతోషం నింపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేళ్లు జీవించాలని ఆలయాల్లో పూజలు చేశారు. అలాగే పైడిపల్లిలో ఎమ్మెల్యే అరూరి, వరంగల్ ఓ సిటీలో ఎమ్మెల్యే నన్నపునేని, నర్సంపేట, గిర్నిబావిలో జరిగి వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్
నమస్తే నెట్వర్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్నదానాలు, పండ్లు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బర్త్‌డే కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, జనగామ జిల్లా దేవరుప్పులలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు, వివిధ పాఠశాలల్లోని వి ద్యార్థులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం, హంటర్ రోడ్డులోని ఏకశిల వృద్ధాశ్రమం, ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ వృద్ధాశ్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చిన్నారులు, వృద్ధులకు కొత్త బట్టలు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండి జాతీయ రాజకీయాల్లోనూ రాణించాలని కోరుతూ వరంగల్ 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి కరీమాబాద్ ఉర్సులోని ఆర్యసమాజ్‌లో దేవయాగం నిర్వహించారు.
నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. వరంగల్‌లోని ఓసిటీ మైదానంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు, పేదలకు పెద్ద ఎత్తన అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్‌డే కేక్ కట్ చేసి వారితో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. బర్త్‌డే సంబురాల్లో భాగంగా వరంగల్‌లో 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి వద్ద దివ్యాంగుల కోసం 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. మహబూబాబాద్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొని ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు, సికింద్రాబాద్తండాలో అన్నదానం ప్రారంభించి, స్వయంగా వడ్డించారు. కురవిలో మహా అన్నదానంలో ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించి సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో మహా అన్నదానాన్ని జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. జనగామ జిల్లాకేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.