హనుమకొండ, ఏప్రిల్ 23: ఈనెల 25 నుంచి మే 8వ తేదీ వరకు హనుమకొండ జిల్లా పరిధిలో ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందిన హనుమకొండ రెవెన్యూ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పోలింగ్ కేంద్రాల్లో జరిగిన మార్పుల వివరాల జాబితాను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వాటి ప్రతులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు సమాచార స్లిప్పులు బీఎల్వోల ద్వారా ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్పులను అందించే ప్రక్రియపై ఆర్డీవోలు స్థానిక తహసీల్దార్ల ద్వారా శిక్షణ ఇవ్వాలని సూచించారు. మారిన పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లకు తెలియజేయాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ, పరకాల ఆర్డీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేరొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేశ్, నారాయణ, పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమారాణి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, నాయబ్ తహసీల్దార్ రామకృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్‌రావు, రావు అమరేందర్‌రెడ్డి, శ్యాంసుందర్, మణి, ఎండీ నేహాల్, రజినీకాంత్, కుమారస్వామి పాల్గొన్నారు.
పరకాల : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించి, నిర్వహణలో భాగంగా సరైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో పలువురు ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చినట్లు తెలిపారు. పోలింగ్ కేం ద్రాల్లో విద్యుత్ సౌకర్యం, ర్యాంపు, మంచినీటి వసతులు చేసినట్లు తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచేందుకు సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో నారాయణ, తహసీల్దార్ భాస్కర్ పాల్గొన్నారు.