ఖిలావరంగల్ : శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాములను 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారని, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, వారానికి మూడు సార్లు కోడిగుడ్డుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలతోపాటు ఏఐ టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ విద్యను కూడా ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తుందని చెప్పారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ బడులకు పిల్లలను పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని, మంచి నాణ్యమైనటువంటి విద్యానందిస్తారని తెలిపారు. విద్యార్థులు అందరూ ప్రైవేట్ పాఠశాల కలర్స్‌ను చూసి మోసపోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ బృందం తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, దేవరాజు, అంజయ్య, నరేందర్, రంగాచారి, సంపత్, ప్రకాష్, స్వప్న, కవిత, సుహాసిని, ధనలక్ష్మి, భవాని, జ్యోత్స్న కిరణ్మయి మరియు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.