నెల్లికుదురు, సెప్టెంబర్ 10 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంచెత్తిన రావిరాల గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా సాయం చేయలేదని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు. ఘటన జరిగి వారం రోజులు దాటినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, బాధితులకు బీఆర్ఎస్, స్వచ్ఛంద సంస్థలే అండగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాలకు చెందిన 150 బాధిత కుటుంబాలకు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పంపించిన నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క వచ్చి మాటలు చెప్పిందే తప్ప చేసిన సా యం శూన్యమని ఎద్దేవా చేశారు. ఇండ్లు నేలమట్టమై, నిత్యావసర సరుకులు వరదల్లో కొట్టుకుపోయి ప్రజలు అరిగోస పడుతున్నారని అన్నారు.
ఇండ్లు కూలిపోయిన వారికి కొత్తవి నిర్మించి ఇవ్వాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 50 వేలు, ఒక్కో బాధిత కుటుంబానికి రూ. లక్ష పరిహారంగా అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, పార్టీ మండలాధ్యక్షుడు పరుపాటి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఆకుల జగ్గయ్య, నాయకులు బిక్కునాయక్, విజయ్, బత్తిని అనిల్, బానోత్ భీముడు, పులి రామచంద్రు, ఆదిరెడ్డి, కత్తుల ఎలేందర్, బాలునాయక్, భోజ్యానాయక్, శ్రీనివాస్, ఎడ్ల మహేశ్, చారి, శ్రీకాంత్, వెంకన్న, సురేశ్, లక్ష్మణ్, వినోద్, మాన్సింగ్, అజిత్, మురళి, శ్రీను, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.