తొర్రూరు, జూన్ 9 : పచ్చిరొట్ట విత్తన విక్రయాల వ్యవహారంలో అధికారుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగిన విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ దందా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇందులో ముగ్గురు ఏఈవోల సస్పెన్షన్ వ్యవసాయశాఖలో ఉన్నతాధికారుల అవగాహన రాహిత్యానికి అద్దం పడుతోంది. ఎంతో గోప్యంగా కేవలం ఏవోల వద్ద మాత్రమే ఉండాల్సిన ఐడీ, పాస్వర్డ్ వివరాలు బ్లాక్ మార్కెటింగ్ కోసం విత్తన విక్రయ కేంద్రాల నిర్వాహకులకు ఇవ్వడం చూస్తే అధికారులే సూత్రధారులని తెలుస్తోంది. ఒక తొర్రూరు మండలం నుంచే 60 శాతానికి పైగా విత్తన బస్తాలు బినామీ లబ్ధిదారుల పేరుతో ఆంధ్రా రాష్ర్టానికి తరలినట్లు సమాచారం. రూ.5లక్షల మేర చేతివాటం ప్రదర్శించారని వ్యవసాయ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తతంగంలో ఏవో స్థాయి నుంచి డీఏవో వరకు ప్రమేయం ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిలో ఎలాంటి ప్రమేయం లేని ఏఈవోలపై చర్యలు తీసుకున్నారంటూ జిల్లాలోని మిగతా ఏఈవోలు నిరసనకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేసింది. మహబూబాబాద్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాలకు సంబంధించి అనేక మండలాల నుంచి జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనం బ్లాక్ మార్కెటింగ్ రూపంలో తరలింది. పొరుగు రాష్ర్టాల్లో వీటికి ఎలాంటి సబ్సిడీ లేకపోవడంతో అక్కడ బాగా డిమాండ్ ఉంది. బహిరంగ మార్కెట్లో జీలుగ విత్తనం ధర కిలోకు రూ.93 ఉండగా మన రాష్ట్రంలో ప్రభుత్వం రూ.55.80 సబ్సిడీ భరిస్తూ రూ.37.20లకు రైతు చెల్లించేలా 30కిలోల బస్తాను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేస్తున్నది. 30కిలోల బస్తా మార్కెట్ విలువ రూ.2,790 ఉండగా ప్రభుత్వ సబ్సిడీ పోను రైతు రూ.1,116 చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండున్నర ఎకరాలకు బస్తా చొప్పున రైతులకు విక్రయిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల టన్నుల పచ్చిరొట్ట విత్తనాన్ని వ్యవసాయ శాఖ జిల్లాలు, మండలాల వారీగా కేటాయించగా తొర్రూరు మండలానికి 500 క్వింటాళ్లు(1668 బస్తాలు) సరఫరా చేసింది. కాగా, తెలంగాణ విత్తన విక్రయ సంస్థ (ఓఎస్ఎస్డీఎస్) సైట్లో రైతు వివరాలను నమోదు చేసి అర్హత ఉన్న వారికి భూవిస్తీర్ణం ఆధారంగా విత్తనాలను కేటాయిస్తూ పర్మిట్‌ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం ఏవోలకు ఇచ్చిన ఐడీ, పాస్వర్డ్ కీలకం.
ఏఈవోల ప్రయేయం ఉందా?
సబ్సిడీ విత్తన విక్రయాలకు కేవలం ఏవోలకు మాత్రమే పర్మిట్ జారీ చేసే అధికారం ఉండగా, తొర్రూరు మండలంలో ఇందుకు భిన్నంగా ఈ వ్యవహారంలో ముగ్గురు ఏఈవోలను సస్పెండ్ చేశారు. ఏవో కే సోమకుమార్ యాదవ్, తొర్రూరు క్లస్టర్ గ్రేడ్-2 ఏఈవో ఎం జమున, అమ్మాపురం క్లస్టర్ ఏఈవో ఆజ్మీరా దీపిక, హరిపిరాల ఏఈవో సీహెచ్ అరవింద్‌ను సస్పెండ్ చేస్తూ మూడు రోజుల క్రితం వ్యవసాయశాఖ కమిషనర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి గత నెల 18 నుంచి 22 వరకు పలు దఫాల్లో తొర్రూరు మండలానికి 500 కిలోల జీలుగ విత్తనాలు వచ్చాయి. విత్తన కేటాయింపు వివరాలను క్లస్టర్ల వారీగా ఏఈవోలకు తెలియజేయాల్సి ఉండగా, 22న రాత్రి ఏఈవోలకు వాట్సాప్ ద్వారా విత్తన కేటాయింపుపై ఏవో సమాచారం చేరవేశారు. అప్పుడు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడం, వ్యవసాయశాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఈ ప్రాంతానికి రావడంతో ఏఈవోలు సబ్సిడీ విత్తనాల విక్రయంపై దృష్టి సారించలేదు. 23న ఏవో తొర్రూరులోని 4 ఆగ్రోస్, పీఏసీఎస్‌లోని విత్తన కేంద్రానికి నిబంధనలకు విరుద్ధంగా యూజర్ ఐడీ, తన పాస్‌వర్డ్‌లను అందజేసినట్లు సమాచారం. 24న ఏఈవోలు విక్రయ కేంద్రాలకు వెళ్లగా, అప్పటికే 60 శాతానికి పైగా విత్తనాలను రైతుల పేరుతో విక్రయించినట్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ తతంగాన్ని ఏవో దృష్టికి తీసుకుపోగా, మనకే పనిభారం తగ్గించారని, విత్తనాలు కావాల్సిన రైతులకే చేరాయి కదా అని సర్ది చెప్పాడు. విత్తనం దొరకక కడుపు మండిన రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి విత్తన విక్రయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొనసాగుతాయి. కానీ ఆన్లైన్లో విక్రయ కేంద్రాల నిర్వాహకులు రాత్రి 7 నుంచి 11 గంటలకు కూడా విత్తనాలు తీసుకెళ్లినట్లు పర్మిట్లు జారీ చేశారు. కొన్ని కేంద్రాల్లో 90శాతం వారికి తోచిన రైతుల పేరుమీద బినామీ పర్మిట్లు ఇచ్చి విత్తనాన్ని పక్కదారి పట్టించారు. 10 ఎకరాల పైబడి బీడు భూమి, మామిడి తోటలు ఉన్న రైతులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి, అవసరం లేని వారికి విత్తనాలను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఏవో కారణంగా రైతుల భూమి, బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రంలోని అనేక మండలాల్లో విత్తన విక్రయదారులకు అనధికారికంగా చేరిపోయాయి.
జీలుగ విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. మరిపెడ డివిజన్ పరిధిలోకి వచ్చే తొర్రూరు మండలంలో జరిగిన బాగోతాన్ని విచారించేందుకు ఏడీఏ శోభన్‌బాబును నియమించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వాస్తవానికి విక్రయ కేంద్రాల నిర్వాహకులు, ఏఈవోలు, పలువురు రైతులు ఇచ్చిన అర్జీలు, వివరాలకు భిన్నంగా ఉన్నతాధికారులకు నివేదికను ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఎన్నికల విధుల ఒత్తిడి కారణంగా ఏవో తన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఏఈవోలకు చేరవేస్తే వారు అవకతవకలకు పాల్పడ్డారని ఏడీఏ నివేదికలో పేర్కొనడంతో ఇప్పుడు ఏడీఏ, డీఏవో స్థాయి అధికారుల పాత్రపై కూడా విమర్శలు వెలుగుచూస్తున్నాయి. విచారణ పక్కదోవ పట్టాయని తెలియడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుని విత్తన విక్రయ కేంద్రాల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే, శాఖాపరమైన చర్యలకు గురైన ఏఈవోలకు మాత్రం ‘మీ ప్రమేయం ఏమీ లేదని తెలుసు.. కానీ ఇప్పుడు ఏం చేస్తాం’ కోర్టుకు వెళ్లండని ఉన్నతాధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల నిర్ణయంపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేసి పునర్ విచారణకు డిమాండ్ చేసేందుకు ఏఈవోలు సిద్ధమవుతున్నారు.