వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి అధిష్టానం ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో అవకాశం దక్కలేదు. దీంతో బీజేపీలో లావాదేవీలతోనే టిక్కెట్లు ఖరారైనట్లు ఆయన వర్గం ఆరోపిస్తోంది. 2014లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన రావు పద్మకు ప్రస్తుతం పశ్చిమ టికెట్ కేటాయించడంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఐదేండ్లుగా పలు కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను ఏకం చేసినప్పటికీ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాకేశ్‌రెడ్డి తన అనుచరుల అభీష్టం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాల తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.
వరంగల్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా ఆదివారం ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి సెగలు తీవ్రమవుతున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీలో వర్గపోరు కొనసాగుతున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి వర్గం పార్టీపై అసంతృప్తి గళం పెంచారు. బీజేపీలో లావాదేవీలతోనే టిక్కెట్ ఖరారైందని ఈవర్గం ఆరోపించారు. గెలుపు ప్రాతిపదిక కాకుండా ఇష్టం వచ్చినట్లుగా టిక్కెట్లు ఖరారు చేశారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆశించామని, దీన్ని ప్రామాణికంగా తీసుకోకుండా పార్టీ నిర్ణయించిందని చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయంపై ఏనుగుల రాకేశ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసినప్పటికీ అన్యాయం చేశారని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐదేండ్లుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో రాకేశ్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఏకం చేశారని, ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం సరికాదని అనుచరులు చెబుతున్నారు.
బీజేపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాకేశ్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. బీజేపీలోని ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు మీ వెంట ఉంటామని ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. బీజేపీలో యువతకు అవకాశం ఇవ్వాలని, పార్టీ అధిష్టానం చేసిన పొరపాటును ఇండిపెండెంట్‌గా పోటీచేసి సరి చేయాలని ఆయన్ను కోరినట్లు తెలిసింది. బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వరంగల్ పశ్చిమలో కచ్చితంగా పోటీ చేసేందుకు రాకేశ్‌రెడ్డి సిద్ధపడినట్లు తెలిసింది. త్వరలోనే నియోజకవర్గంలోని బీజేపీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని ఆయన వర్గీయులు అంటున్నారు. మరికొన్ని సెగ్మెంట్లలోనూ బీజేపీలో తిరుగుబాటు మొదలవుతున్నది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వరకు వెళ్లింది. వరంగల్ పశ్చిమ (హనుమకొండ) సెగ్మెంట్లలో 1999 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.
ఆ తర్వాత ఆ పార్టీకి ఎప్పుడూ గణనీయమైన ఓట్లు దక్కలేదు. బీజేపీలోని నియోజకవర్గ, జిల్లా నాయకత్వం కారణంగానే పార్టీకి ప్రస్తుత పరిస్థితి వచ్చిందని కాషాయ నేతలు వాపోతున్నారు. 2004, 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీస స్థాయిలోనూ బలం చూపలేదని.. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. గతంలో వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీ చేసిన రావు పద్మకు, ఇప్పుడు పశ్చిమ టికెట్ కేటాయించడం ఏమిటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రావు పద్మ 2014లో వరంగల్ తూర్పులో పోటీ చేయగా, ప్రస్తుతం సీటు మార్చారు. బీజేపీ అధిష్టానం నిర్ణయాలు ఇలా ఇష్టం వచ్చినట్లు ఉండడంపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకేశ్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే మద్దతు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.