వరంగల్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మరోసారి ప్రతికూల నిర్ణయం వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నామినేట్ చేసిన ముఖ్యుల(డిగ్నిటరీ) జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మరో మంత్రి సీతక్కకు దక్కిన ప్రాధాన్యత కొండా సురేఖకు దక్కలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ, సీతక్క ఉన్నారు.
ఆగస్టు 15న అన్ని జిల్లాల్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యుల జాబితాను చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా వేడుకలకు ముఖ్య అతిథిగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హనుమకొండ జిల్లా వేడుకల్లో పాల్గొనేలా నామినేట్ చేశారు. కొండా సురేఖ ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పూర్తిగా వరంగల్ జిల్లాలోనే ఉన్నది. వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు ఆగస్టు 15 వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం సొంత జిల్లాలో కాకుండా పక్కన ఉన్న హనుమకొండ జిల్లాలో ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రస్తుతం ములుగు జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్నది.
ఆగస్టు 15 ఉత్సవాలకు ములుగు జిల్లా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్కకు సొంత జిల్లాలోనే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరో మంత్రి కొండా సురేఖను పక్కన ఉన్న హనుమకొండ జిల్లాకు నామినేటెడ్ చేయడంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్ జిల్లా వేడుకకు ముఖ్య అతిథిగా నిర్ణయించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు.
రాష్ట్రంలోని మంత్రుల్లో ఎవరూ ఇన్‌చార్జీగా ఉన్న జిల్లాల్లో ఆగస్టు 15 వేడుకలకు ముఖ్య అతిథిగా లేరు. మంత్రి కొండా సురేఖ సొంత అసెంబ్లీ సెగ్మెంట్, సొంత జిల్లాలో ఆమెను పక్కనబెట్టి మరీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి సురేఖ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, సీతక్క మధ్య ఇప్పటికే వర్గపోరు నడుస్తున్నదని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. తాజా ఆగస్టు 15 ఉత్సవాల్లో నూ సీతక్కకు ప్రాధాన్యం ఇచ్చి, సురేఖను పక్క జిల్లాలో పాల్గొనేలా చేయడంతో ఇది మరింత ఎక్కువయ్యే అకాశం కనిపిస్తున్నది.
జిల్లాల వారీగా ఆగస్టు 15 ఉత్సవాల ముఖ్య అతిథులు(డిగ్నిటరీ)
వరంగల్ : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హనుమకొండ : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ములుగు : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
మహబూబాబాద్ : ప్రభుత్వ విప్ జె.రామచంద్రునాయక్
జనగామ : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పొదెం