జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన రెండేళ్లుగా పనులన్నీ పెండింగ్‌లో పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన 70 శాతం పనులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పరిసర గ్రామాల రైతులు నాలుగు పంటలు నష్టపోగా, ఈ యాసంగిలోనూ అదే పరిస్థితి నెలకొంది. కేవలం 5 కిలోమీటర్ల పైపులైన్ నిర్మించి కరెంట్ సరఫరా చేస్తే ప్రాజెక్టు ఉపయోగంలోకి వచ్చి.. 5 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై వివక్ష చూపుతున్నది. రైతుల విన్నపాలను పెడచెవిన పెడుతున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ)
భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం సమీపంలో భీంఘణపూర్ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మెట్ట భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో రూ. 64 కోట్లతో కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా పంప్‌హౌస్, సబ్‌స్టేషన్, 14 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ నిర్మించి గండికామారం, గొల్లబుద్దారం, దూదేకులపల్లి, దీక్షకుంట గ్రామాల రైతులకు సాగునీరందించాల్సి ఉంది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పంప్‌హౌస్, సబ్‌స్టేషన్ నిర్మాణంతో పాటు 9 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ పనులు పూర్తి చేసింది. పంప్‌హౌస్ సమీపంలో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు 240 హెచ్‌పీ మోటర్లు, మూడు 170 హెచ్‌పీ మోటర్లను ఏర్పాటు చేసింది. మరో 5 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. అయితే, అక్కడ అటవీ భూములుండడంతో ఆ శాఖ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో పనుల్లో జాప్యం జరిగింది. చివరికి అప్పటి కలెక్టర్ భవేశ్‌మిశ్రా అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అప్పటికే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో సీతారామ ప్రాజెక్టును పట్టించుకునేవారు కరువయ్యారు.
సీతారామ ప్రాజెక్టులో భాగంగా 5 కిలోమీటర్ల పెండింగ్‌లో పనులు పూర్తి చేసి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే 5 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. భీంఘణపూర్ చెరువును దేవాదుల రిజర్వాయర్‌గా మార్చడంతో నీరు పుష్కలంగా ఉన్నది. ఏటూరునాగారం ఇన్‌టేక్‌వెల్ నుంచి గోదావరి జలాలు దేవాదుల పైపులైన్ ద్వారా ఈ రిజర్వాయర్‌కు చేరుతాయి. ఇక్కడి నుంచి మూడు ఫేజ్‌ల ద్వారా రామప్ప, పులుకుర్తి, చలివాగు రిజర్వాయర్లకు చేరుతాయి. కాగా, భీంఘణపూర్ రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే మెట్ట భూములకు సాగునీరందుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. రూ. 6 కోట్లు వెచ్చించి పైపులైన్, విద్యుత్ సౌకర్యం కల్పిస్తే రైతులకు ఇప్పటికే నాలుగు పంటలు పండేవి. కనీసం విద్యుత్ సౌకర్యం కల్పించినా 9 కిలోమీటర్ల మేర ఉన్న పైపులైన్ ద్వారా సుమారు 2 వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయమై నోరు మెదపకపోవడం రైతులకు శాపంగా మారింది. సమీపంలోనే భీంఘణపూర్ రిజర్వాయర్ ఉన్నా మెట్ట భూములకు నీరందని పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు వివక్ష కొనసాగుతున్నది. తెలంగాణలో కేసీఆర్ మూలాలను చెరిపేసే కుట్రలు జరుగుతున్నాయనడానికి ప్రాజెక్టులే నిదర్శనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రెండేళ్లుగా పక్కన పెట్టారు. ఎన్డీఎస్ఏ, విచారణ కమిటీల పేరుతో ఇంకా కాలయాపన చేస్తూనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 70 శాతం పనులు పూర్తి చేసిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టునూ ఇప్పటికీ పూర్తి చేయలేదు. డీబీఎం-38 కాల్వ ద్వారా చుక్క నీరివ్వలేదు. చివరికి సీతారామ ప్రాజెక్టునూ పక్కన పెట్టేసింది. రెండేళ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదు. కనీసం ఆ ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదంటే ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి అవగతమవుతున్నది.