రైతులు పండిస్తున్న పంటల సాగును డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టి న డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) తమ వల్ల కాదని ఏఈవోలు చేతులెత్తేశారు. సిబ్బంది కొరత, తీవ్రమైన పని ఒత్తిడి వంటి కారణాలతో విముఖత చూపుతున్నారు. ఇప్పటికే తలకు మించిన భారమవుతోందని, కొత్త బాధ్యత మోయలేమని తేల్చిచెబుతున్నారు. ప్రతి వెయ్యి ఎకరాలకు గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను ఇస్తే సర్వేతోపాటు ఇతర పథకాలకు సంబంధించిన పనులను సులభంగా పూర్తి చేస్తామంటున్నారు.
– హనుమకొండ సబర్బన్, అక్టోబర్6
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి 6-8వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించారు. ప్రస్తుతం రైతుభరోసా, రైతు బీమా, పీఎం కిసాన్, పంట నష్టం సర్వేలు, ధాన్యం సేకరణ లాంటి పనులతోపాటు రుణమాఫీ కుటుంబ సర్వేలు లాంటి 49 రకాల పనులను చేస్తున్నారు. దీనికి తోడు డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) చేయాలనడంతో తాము మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఏఈవోలు వాపోతున్నారు.
దీనికితోడు ఏఈవోల్లో 65 శాతం మంది మహిళలే ఉండగా, దూర ప్రాంతాల్లోని పంటల వద్దకు వారు వెళ్లి క్రాప్ సర్వే చేయడం వారి భద్రతకు భరోసా లేకుండా పోతుంది. సర్వే నంబర్ల వారీగా కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ ఫొటోలు తీయడం సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు ఒక పంట కాలం బీడుగా ఉంచుకొని మరొక పంట కాలంలో సాగు చేస్తారు. అలాంటి సందర్భంలో రెండు సార్లు అదే పొలానికి వెళ్లడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను నియమించి డిజిటల్ క్రాప్ సర్వే చేస్తుండగా, మహారాష్ట్రలో టాటా కంపెనీతో కలిసి ఈ-పీక్ పహాణీ పేరిట ఒక మొబైల్ యాప్‌ను తయారుచేసి రైతులతోనే పంట వివరాలను అప్లోడ్ చేయిస్తున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటకలో స్థానిక యువకులతో, తమిళనాడు రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ డెయిలీ వైజ్ కూలీలతో సర్వే లు చేపట్టారు. మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక అసిస్టెంట్ చొప్పున నియమిస్తేనే ఈ సర్వే పూర్తవుతుందని ఏఈవోలు స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము డిజిటల్ క్రాప్ సర్వే చేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారి సంఘం ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కేవలం ఏఈవోలు మాత్రమే డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించాలనడం సరికాదు. ఇప్పటికే పలు పనుల భారంతో డిజిటల్ క్రాప్ సర్వే చేయడం తలకుమించిన భారమవుతోంది. ప్రభుత్వం ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే బాగుంటుంది.
– రాజు, ఏఈవోల సంఘం రాష్ట్ర కోశాధికారి