కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇలా భర్తీ చేసిన వాటిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాత నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, వారికే నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత ప్రభుత్వంలో దాదాపు మొత్తం కాలం నామినేటెడ్ పోస్టును అనుభవించి, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఓ నాయకుడికి ఎమ్మెల్యే నాయిని అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని అధికార పార్టీలోని ఓ కార్పొరేటర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే నాయిని ముందే కార్పొరేటర్, ఆయన అనుచరులు.. వలస నేతపై దాడి చేసినంత పని చేశారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేపైనా అక్కడున్న కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల వారిని తీసుకోవాల్సిన అవసరం ఏముందని, వారికే పదవులు ఎందుకు ఇచ్చారని ఎమ్మెల్యేను నిలదీశారు. ఓ స్కూల్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇది జరిగింది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చొరవ తీసుకోకపోవడం వల్లే తమకు నామినేటెడ్ పదవులు దక్కడంలేదని పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్ర వ్యాప్తంగా 37 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పొదెం వీరయ్య, జంగా రాఘవరెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఎండీ రియాజ్, బెల్లయ్యనాయక్, అయిత ప్రకాశ్‌రెడ్డికి పదవులు ఇచ్చింది. నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలోని నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని పాత నేతలు అంటున్నారు.
మార్కెట్, ఆలయ కమిటీలు, జిల్లాస్థాయి పోస్టుల భర్తీ విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉండడంపై పాత నేతల్లో అసహనం పెరుగుతున్నది. కొత్తగా వచ్చిన వారికి ఇచ్చేందుకే భర్తీ ప్రతిపాదనలను వాయిదా వేస్తున్నారనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ‘మీకు కావాల్సింది మీకు దక్కింది. మరి మా సంగతి ఏమైంది’ అని ఇటీవల గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ ఎమ్మెల్యేను కొందరు అధికార పార్టీ నేతలు ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే అయిన నాయకుడికి ఇప్పుడు ఈ అసంతృప్తి సెగ మరింత ఎక్కువగా ఉంది.