కరీమాబాద్ జూన్ 17 : ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, అత్యున్నత విద్యార్హతలున్న అధ్యాపకులచే బోధన జరుగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్మీడియేట్ అడ్మిషన్ల ప్రచారం, పాఠ్యపుస్తకాల పంపిణీలో భాగంగా స్థానిక రంగశాయిపేట జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి మాట్లాడుతూ ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన విద్యా బోధన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్స్, అధ్యాపకులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ మాయజాలంలో పడి లక్షల రూపాయలు కోల్పొతున్నారని, స్థానిక ప్రభుత్వ కళాశాలలో తమ పిల్లలను చేర్చి నాణ్యమైన విద్యను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, అధ్యాపకులు మల్లారెడ్డి, ఎల్లాస్వామి, లైబ్రేరియన్ రాములు, తదితరులు పాల్గొన్నారు.