కృష్ణకాలనీ, జూన్ 26 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దుచేయాలంటూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను, బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు మోటపలుకుల రమేశ్, భూపాలపల్లి పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడు తూ దేశంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే 60 సింగరేణి బ్లాకులను వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఉత్తర తెలంగాణకే గుండెకాయలాంటి సింగరేణి సంస్థను బీజేపీ సర్కారు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని, దీనివల్ల కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వేలాన్ని విరమించుకోకుంటే సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మకు వినతిపత్రం అందించారు. నాయకులు క్యాతరాజు సతీశ్‌కుమార్, గురిజేపల్లి సుధాకర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నేరెళ్ల జోసెఫ్, ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ ఆసిఫ్ పాషా, బ్రాంచ్ కమిటీ సభ్యులు రవికుమార్, నూకల చంద్రమౌళి, ఫిట్ సెక్రటరీలు ఎల్ శంకర్, పీ శ్రీనివాస్, దోర్నాల తిరుపతి, ఎం రమేశ్, ఎండీ కరీముల్లా, శ్రీకాంత్ పాల్గొన్నారు.