ఖిలావరంగల్, ఏప్రిల్ 21: నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ గరీబోళ్ల బస్తీకి ఇంటి నెంబర్లు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రణయ్ దీప్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఫొటోపై బస్తీ వాసుల డిమాండ్లను ప్రచురించి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేటలో నిలువ నీడలేని ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల నిరుపేదలు నాలుగేళ్ల క్రితం అంబేద్కర్ నగర్ గరీబోళ్ల బస్తీ పేరుతో 205 గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని అన్నారు.
నాలుగేళ్లుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. బస్తీలోని గుడిసెలకు ఇంటి నెంబర్లు కేటాయించి విద్యుత్తు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం గత నెల 25 నుంచి నర్సంపేట పాత తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిరాహార దీక్షలు చేశామని, దీనికి అన్ని పార్టీలు కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే 813 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 2.30 ఎకరాలు కబ్జా చేశారన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పేద ప్రజల కోసం గుడిసెలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత, బలహీన వర్గాల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు దళితరత్న అందే రవి, ఎంఎస్పి నర్సంపేట నియోజకవర్గ కో కన్వీనర్ తడుగుల విజయ్ మాదిగ, డీబీడీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జలగం రమేష్, తదితరులు పాల్గొన్నారు.