భూపాలపల్లి రూరల్, జూలై 6 : బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడం వల్ల ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని భూపాలపల్లి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాకుల వేలం పాటను వెంటనే ఆపేసి, సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరుతూ శనివారం సాయంత్రం భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట భూపాలపల్లి టీబీజీకేఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడంతో సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, 41వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందన్నారు.
ఈ నెల 9న సింగరేణి వ్యాప్తంగా గోదావరిఖనిలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు నలవెల్లి సదానందం, జాయింట్ సెక్రటరీ రత్నం అవినాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరీపతి శర్మ, కమిటీ మెంబర్ భాషనపల్లి కుమారస్వామి, కేటీకే రన్నింగ్ లైన్ పిట్ సెక్రటరీ అన్నాడి మల్లారెడ్డి, కేటీకే -5 ఇైంక్లెన్ పిట్ సెక్రటరీ నరేశ్, రాంచందర్, దేవరకొండ మధు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు
కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై దీక్షను ప్రారంభించారు. మొదటి రోజులో భాగంగా భూపాలపల్లి ఏరియా కేటీకే వన్ ఇంకె్లైన్ ఫిట్ కమిటీ నాయకులు కార్మికులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను కార్పొరేట్ కంపెనీలకు వేలం వేస్తున్నదని, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరారు. ఈనెల 12 వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, విజేందర్, చంద్రమౌళి, శ్రీనివాస్, సతీశ్ పాల్గొన్నారు.