వర్ధన్నపేట, జూలై 13 : తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో గురువారం ధర్నా నిర్వహించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. పేరుకే ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నామని చెప్పి రోజులో కనీసం ఐదు గంటలు కూడా సరఫరా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆర్థికంగా కుదేలైన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు సాగునీటి రంగాన్ని మెరుగు పరచడంతో రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి తెలంగాణ రైతులపై తన వ్యతిరేక వైఖరిని చాటుకుంటున్నారన్నారు.
టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు కేవలం మూడు గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదన్నట్లుగా మా ట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాక రైతుల సంక్షేమ పథకాల విషయంలో కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ పచ్చబడిన తెలంగాణ చూసి ఓర్వలేక పోతున్నాడన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడిన విధానంతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో తెలంగాణ రైతులు మండిపడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో రైతులే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అందుతున్న సంక్షేమ పథకాల ను కూడా అందనివ్వకుండా చేస్తారని ధ్వజమెత్తారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అలాగే, ఈ నెల 14, 15 తేదీల్లో అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే రమేశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఆయా మండలాల పార్టీ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.