భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 18: భూపాలపల్లి పట్టణంలోని కొంపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 171లో గల 106.34 ఎకరాల భూమి అటవీ శాఖదేనని గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని డీఎఫ్వో వసంత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భూమిపై హక్కును కోరుతూ 1985లో మహ్మద్ అబ్దుల్ ఖాసీం కోర్టులో కేసు వేయగా రెండు సార్లు అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై ఖాసీం హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయగా ఆయనకు అనుకూ లంగా రావడంతో అటవీశాఖ మే 2021లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు విన్న ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఆ భూమి అటవీ శాఖకు చెందుతుందని తీర్పు ఇచ్చిందని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని ఆమె పేర్కొన్నారు.