హనుమకొండ చౌరస్తా, జులై 10: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వర దేవాలయంలో ఆషాడ పౌర్ణమి సందర్భంగా రుద్రేశ్వరస్వామికి 21 కూరగాయలతో రుద్రేశ్వరదేవికి ఖడ్గమాలతో పేర్కొన్నవిధంగా అమ్మవారిని అలంకరించారు. ఆషాఢ పూర్ణిమను గురుపూజోత్సవం చేయడం మన భారతీయ సంస్కృతిలో భాగమైందని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఉదయం రుద్రునికి రుద్రాభిషేకం అనంతరం ఆకుకూరలు, కూరగాయలతో రుద్రుడు, రుద్రేశ్వరీదేవికి కూరగాయలతో శాకంబరునిగా శాకాంబరీదేవిగా అలంకరించారు.
దేవాలయంలో మహిళా టీచర్ బొమ్మిరెడ్డిపల్లి గాయత్రిదేవి(హిందీ), కె.పద్మజ(హైదరాబాద్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్), వరంగల్ ఎయిడెడ్ స్కూల్ టీచర్ మయూరి(తెలుగు) గురువులను ఘనంగా సత్కరించారు. వేలాది మంది భక్తులు రుద్రేశ్వరున్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి శాకంబరునిగా కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్, ఆలయ అర్చకులు సందీప్‌శర్మ, ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, ఆలయ సిబ్బంది రామకృష్ణ, మధుకర్, రజిత, సుజాత భక్తులకు సేవలందించారు. స్వామివారికి మహాహారతి అనంతరం పులిహోర, సిరా ప్రసాదాన్ని వేలాది మంది భక్తులకు పంపిణీ చేశారు.