తాడ్వాయి, ఫిబ్రవరి11 : మేడారం వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఆరు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులు రాకతో మేడారం జాతర పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్వరగా దర్శనం చేసుకుని వెళ్లేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
కొనుగోళ్లతో పలు రకాల దుకాణాలు సందడిగా మారాయి. జాతరకు ముందుగానే వ్యాపారం జోరుగా సాగుతుండడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు రూ.50 ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను కొనుక్కుని దాహం తీర్చుకోవాల్సి వస్తున్నది. అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.