ధర్మసాగర్, అక్టోబర్ 27 : తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలులో లేవని, ఆ పార్టీల నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని జానకీపురం, క్యాతంపల్లి, కేశవనగర్ గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎంగా పదేళ్ల పరిపాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశారన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయని పథకాలు ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
ప్రజలందరూ ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. దేవాదుల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగు నీరు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.16 వేలు పంట పెట్టుబడి, ఆసరా ఫించన్లు రూ.5016, సౌభాగ్యలక్ష్మి పథకంలో తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళకు రూ.3000 వేలు, కేసీఆర్ బీమా పథకం, గృహలక్ష్మి, దళిత బంధు పథకాలు అమలు చేస్తారన్నారు. ప్రజలందరూ తనను ఆశీర్వదించి, గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మునిగెల రాజు, జడ్పీటీసీ డా. పిట్టల శ్రీలత, సర్పంచ్‌లు నవ్య, అవనీజ రెడ్డి, మునిగాల శోభ, ఎంపీటీసీలు సోమక్క, శశిరేఖ, మండల రైతు కోఆర్డినేటర్ కరుణాకర్, బీఆర్ఎస్ నాయకులు చాడ నర్సింహారెడ్డి, విప్లవ్ రెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, సత్యనారాయణ, మహేందర్, మొగిలి, నాగరాజు, సదన్ రాజు, రాజేందర్, రాజు, రమేశ్ పాల్గొన్నారు.