హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 21: హనుమకొండ జిల్లాలో ప్రీ-ప్రైమరీ విద్య బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీఈవో డి.వాసంతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష పథకం కింద బాల్యదశ సంరక్షణ మరియు విద్య (ఈసీసీఈ) బలోపేతం చేయడంలో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరం నుంచి హనుమకొండ జిల్లాలో 45 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించబడుతున్నట్లు తెలిపారు.
హనుమకొండ జిల్లాలో 45 పాఠశాలలకు మంజూరు చేసిన మొత్తం 52,50,000 (కలెక్టర్ ఖాతాకు ఇప్పటికే జమ చేయబడింది), ప్రతి పాఠశాల నిధులు: రూ.1,70,000, ఫర్నిచర్ రూ.50 వేలు, ఇండోర్ అండ్ అవుట్ డోర్ ఆట వస్తువులు రూ.50 వేలు, పెయింటింగ్ అండ్ చిన్నచిన్న మరమ్మతులు రూ. 50 వేలు, చెప్పులు, యూనిఫాం, టై, బెల్ట్ ప్రతి విద్యార్థికి రూ.1,000, గుర్తించబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒక ప్రత్యేక గదిని ప్రీ-ప్రైమరీ కోసం సిద్ధం చేయాలని, ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు స్థానిక సమాజంతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల చేరికకు ప్రోత్సహించాలన్నారు.
విద్యార్థుల విద్యా బోధనకు, వారి అవసరాలు చూసుకునేందుకు ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు నియామకానికి త్వరలోనే ప్రకటనలు జారీ చేయబడతాయన్నారు. కొత్తగా మంజూరైన ప్రీప్రైమరీ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం పిల్లలకు ఆనందదాయకమైన విద్యావాతావరణాన్ని, బలమైన ప్రాథమిక నైపుణ్యాలను, ప్రాథమిక విద్య సాఫీగా కొనసాగుటకు తగిన అవకాశం కల్పిస్తుందని డీఈవో వాసంతి తెలిపారు.