పరకాల, జనవరి 13 : గృహలక్ష్మీ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హనుమకొండలోని ఆయన నివాసంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, పరకాల నియోజకవర్గానికి 3వేల ఇండ్లను మంజూరు చేసిందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలను అందించగా, పలువురు పాత ఇళ్లను కూల్చివేసి నూతన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో బిల్లుల చెల్లించలేదని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని రద్దు చేయడంతో ఇళ్లు నిర్మించుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారన్నారు. కాగా, గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయగా, బిల్లులు మంజూరు చేయాలని ఆదేశించినట్లు చల్లా పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాలు చేపట్టిన సుమారు 500మందికి బిల్లులను చెల్లించడంతో పాటు మిగిలిన లబ్ధిదారుల జాబితాతో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.