తొర్రూరు, మే 3: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని అధికారుల నిలదీతలు, నిరసనలతో పల్లెలు అట్టుడుకుతున్నాయి. నిజమైన లబ్ధిదారులకు కాకుండా, ఆస్తిపాస్తులున్న వారు, కాంగ్రెస్ అనుయాయులకే ఇండ్లు కేటాయించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎకడైనా అవకతవకలు జరిగితే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
తొర్రూరు మండలంలో అర్హులకు జరిగిన అన్యాయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి మౌనంగా ఉండడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇండ్లు రాజకీయాలకతీతంగా నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలని ప్రజలు డిమాండ్ కోరుతున్నారు.
వెంకటాపురం గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల విచారణ కోసం వచ్చిన అధికారులపై గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కొండ రాంనర్సమ్మ మాట్లాడుతూ.. మొదట అధికారులు తమ ఇంటికి విచారణ కోసం వచ్చినా, కొందరు కాంగ్రెస్ నాయకులు అధికారులపై దౌర్జన్యం ప్రదర్శించి తన పేరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, తన కొడుకు బీజేపీలో తిరుగుతున్నాడని పేరును తొలగించారని తెలిపింది.
కంఠాయపాలెం గ్రామానికి 40 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై శనివారం అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీవో గణేశ్, ఎంపీడీవో పూర్ణచేందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో గణేశ్ మాట్లాడుతూ.. అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆస్తులున్న వారిని వెరిఫికేషన్ ప్రక్రియలో తొలగిస్తామని, లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శిస్తామన్నారు.
అభ్యంతరాలుంటే పరిశీలించి అర్హత లేని వారిని జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీలు కూడా అర్హతలేని వ్యక్తులను వెరిఫికేషన్ సమయంలో తొలగించేందుకు చర్యలు తీసుకుంటాయని హామీ ఇచ్చారు. కాగా, నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం గ్రామస్తులు తమకు ఇండ్లు మంజూరు చేయాలని శనివారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.