Double Murder Case | వరంగల్ లీగల్, మే 20: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను, మాయమాటలతో తనకు కాకుండా చేస్తున్నారన్న పగతో, భార్య తల్లిదండ్రులను నరికి చంపిన నేరస్తునికి మరణశిక్ష విధిస్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెలువరించారు.
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే.. మృతుడు బానోత్ శ్రీను తల్లి బానోతు వీరమ్మ ఫిర్యాదు ప్రకారం వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం 16 చింతల తండాకు చెందిన తన మనవరాలు దీపిక హనుమకొండలోని పింగళి కళాశాలలో చదువుకునేది. ఈ క్రమంలో తమ సమీప గ్రామమైన గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆటో నడుపుకునే నిందితుని మాటలు నమ్మిన దీపిక ఆ తర్వాత ఎవరికి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
దీపికపై , కుటుంబ సభ్యులపై పగ పెంచుకొని..
కొద్ది రోజుల్లోనే నాగరాజు ప్రవర్తన నచ్చక దీపిక తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని అక్కడే స్థిరపడిపోయింది. అప్పటినుండి దీపికపై , ఆమె కుటుంబ సభ్యులపై పగ పెంచుకొని తనకు తన భార్యను దూరం చేసిన దీపిక తల్లిదండ్రులను, దీపికను, ఇతర కుటుంబ సభ్యులను ఎప్పటికైనా చంపేస్తానని అప్పుడప్పుడు తమ తండాకు వచ్చి నిందితుడు నాగరాజు బెదిరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది.
అందులో భాగంగా 10 – 07- 2024 రోజు అర్ధరాత్రి పొడవాటి కత్తితో మోటార్ సైకిల్ పై తమ తండాకు చేరుకున్న నాగరాజు ఇంటి ముందు పడుకున్న దీపికను,ఆమె తండ్రి శ్రీను,తల్లి సుగుణ, సోదరుడు మదన్ లపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు, ఈ దాడిలో దీపిక తల్లి అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలో దీపిక తండ్రి శ్రీను మృతి చెందాడు. తీవ్ర గాయాలైన దీపిక, మదన్ లను తండావాసులు ఆసుపత్రి కి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారిరువురూ ప్రాణాలు నిలుపుకున్నారు.
ఈ స్వైర విహారంలో నిందితుడు నాగరాజు అడ్డు వచ్చిన తండావాసులను బెదిరిస్తూ పారిపోయి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడడం కోసం చేయి కోసుకొని ఆ తర్వాత తన భార్య దీపిక మరణించలేదని విషయం గుర్తుకొచ్చి అక్కడ నుండి పారిపోయి కుటుంబ బంధువుల ఇళ్లలో తలదాచుకోగా పోలీసులకు పట్టుబడ్డాడు అని కేసు దర్యాప్తు ద్వారా తెలిసింది.
ఇటువంటి నిందితులకు జీవించే హక్కు లేదు..
అత్యంత సంచలనం కలిగించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు విభాగం నిందితునిపై హత్య, హత్య ప్రయత్నం తదితర క్రిమినల్ కేసులు నమోదు చేయగా, అప్పుటి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు, ఆ తదుపరి బాధ్యతలు చేపట్టిన నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఈ కేసులో పూర్తి సాక్షాదారాలతో నిందితునికి వ్యతిరేకంగా చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో బాధితుల పక్షాన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బృందా దేవి వాదిస్తూ,అత్యంత హేయమైన ఈ హత్యాకాండకు పాల్పడిన నిందితునికి మరణిశిక్ష వేధించాలని, ఈ శిక్ష నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించాలని న్యాయస్థానాన్ని కోరారు. సాక్ష్యాదారాలు, వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి జె.మైత్రేయి నిందితుడు మేకల నాగరాజు నేరపూరిత హత్యాకాండ అత్యంత పాశవికమైనదని, ఇటువంటి నిందితులకు జీవించే హక్కు లేదని, నిందితున్ని మరణించే వరకు మెడకు ఉరివేసి శిక్షణ అమలు పరచాలని తమ తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసులో లైసెన్ ఆఫీసర్ కంతేటి హరికృష్ణ పర్యవేక్షణలో కోర్టు డ్యూటీ ఆఫీసర్ టి.సురేందర్ సాక్షులను, ఇతర ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తీర్పు అనంతరం నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదువుకునే అమ్మాయిలు జులాయి, జల్సారాయుళ్ల మాయలో పడి తమ జీవితాలను, తమ కుటుంబ సభ్యుల జీవితాలను బలి పెట్టవద్దని సూచించారు. విద్యార్థి దశలో కేవలం లక్ష్యంపై దృష్టి పెట్టి తల్లిదండ్రుల కలలు పండించి సమాజ ఉన్నత కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు.
Chattogram | బంగ్లాదేశ్లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు