మహబూబాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాను వరదలు ముంచెత్తాయి. దీంతో కూడు, గూడు, గొడ్డు, గోదా.. అన్నీ కొట్టుకుపోయాయి. సుమారు 8 మంది వరకు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన మోతీలాల్, యువ శాస్త్రవేత్త అశ్విని మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జి వద్ద కారుతో సహా కొట్టుకుపోయారు. అదేవి ధంగా తొర్రూరు మండలం వెంకటాపురంలో నర్సయ్య మృతి చెందాడు.
మహబూబా బాద్ మండలం ఈదులపూసపల్లి వద్ద రాళ్లవాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన నాగభూషణం రాళ్ల వాగులో గల్లంతయ్యాడు. వరదల్లో కొట్టుకుపోయి 15 రోజులు గడుస్తున్నా మృతదేహం లభించకపోవడంతో అతడి బంధువులు ఇటీవల ఎస్పీని కలిసి వెతికివ్వాలని వేడుకున్నారు. అదేవిధంగా బయ్యారం మండలం బంజారా తండా శివారులో పాకాల ఏరులో ఓ శవం కొట్టుకురాగా, ఆనవాళ్లు పోలీసులకు లభించకపోవడంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మృతదేహాన్ని ఖననం చేశారు.
ఈనెల 11న బయ్యారం మండలం సింగారం టు కాలనీకి చెందిన వృద్ధురాలు జహీదాబి మృతదేహం నాలుగు రోజులుగా వెతికిన తర్వాత అలిగేరు ఏటిలో లభ్యమైంది. 13న ధర్మాపురం గ్రామానికి చెందిన పూనం వెంకన్న నామాలపాడు శివారులో ఉన్న జిన్నెల వాగులో పడి మృతి చెందాడు. అదేవి ధంగా కేసముద్రం మండలం కేసముద్రం విలేజ్ ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన భాగవత్ వాణి వరదల్లో చికుకొని వర్షపు నీరు మింగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. మానుకోట ప్రాంతం ఏర్పడినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా వర్షాలు కురవడంతో ప్రాణ, ఆస్తి, నష్టాలు సంభవించాయి