జనగామ, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : అధికారం ఉన్నా, లేకపోయినా అంతర్గపోరు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు. అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత దూషణలతో కొందరు నాయకులు ఆ పార్టీ పరువును బజారుకీడ్చేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా, జనగామ కాం గ్రెస్ నాయకుల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరి, పంచాయతీ అధిష్ఠానం వద్దకు చేరింది. గాంధీభవన్‌లో రెండు గ్రూపుల నాయకులు ఎవరికి వారే పరస్పరం అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకున్నారు.
అభ్యర్థి ఓటమికి కారణమై, పార్టీ వ్యతిరేక కా ర్యకలాపాలకు పాల్పడుతూ, ప్రభు త్వ కార్యక్రమాలను అభాసుపాలు చేసిన అసమ్మతి నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి నివేదిక రూపంలో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే శనివారం కొమ్మూరి నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సీనియర్ నాయకులు కొందరు తన ఒంటెద్దు పోకడలతో పార్టీని నిర్వీర్యం చేస్తూ ‘ఢీఛీఛీ’ అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న కొమ్మూరిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ సహా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డికి ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ సీనియర్లతో సఖ్యతగానే ఉన్నట్లు కనిపిస్తూ కలిసి పనిచేసిన డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ఓటమి తర్వాత ‘అంతా వాళ్లే చేశారు.. వెనక ఉండి ముందు గోతులు తీశారు’.. ‘కాదు..కాదు అభ్యర్థి ఒంటెత్తు పోకడల వల్లే..పార్టీ ఓడింది’..అంటూ పార్టీ అంతర్గత సమావేశాల్లో గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత దూషణలతో బాహాబాహీకి దిగి సోషల్ మీడియాలో పెట్టిన వ్యతిరేక పోస్టులను వైరల్ చేశారు. అప్పటి నుంచి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి, పార్టీ సీనియర్ నాయకులకు మధ్య పూడ్చలేనంతగా గ్యాప్ పెరిగి రెండు గ్రూపులుగా విడిపోయారు. వ్యతిరేకవర్గం నాయకులంతా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో సఖ్యతగా మెలుగుతూ వస్తున్నారు.
మంత్రుల పర్యటనలు, అధికారిక కార్యాక్రమాల సందర్భాల్లో గ్రూపుల వారీగా విడివిడిగా స్వాగతాలు పలకడం.. సత్కారాలు చేయడం, డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేకుండా ప్రధాన కూడళ్లల్లో ఫ్లెక్సీలు కట్టడం వంటి చర్యలతో జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్థంగా మారింది. అధికారంలోకి వచ్చిన 9 నెలల నుంచి లోలోపల గ్రూపుల కొట్లాటలు.. నాయకుల మధ్య కుమ్ములాటలు.. అసమ్మతి సమావేశాలతో గుంభనంగా ఉన్న వర్గపోరు సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘ప్రజాపాలన’ అధికారిక వేదికపైనే బయటపడింది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలోనే సొంత పార్టీ నాయకుల నుంచే డీసీసీ అధ్యక్షుడికి నిరసన సెగ తాకింది. ఏ హోదాలో కొమ్మూరిని వేదికపై కూర్చోబెట్టారంటూ పార్టీ నాయకులే జిల్లా అధికారులను నిలదీసి కిందకు దిగే దాక అసమ్మతి నాయకులు పట్టుబట్టారు. కొమ్మూరి అనుకూల, వ్యతిరేక వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘నువ్వెంత..అంటే నువ్వెంత’..‘నీ సంగతి చూస్తా.. అంటే, నీ సంగతి కూడా చూస్తా’..‘మీలాంటి వారి వల్లే పార్టీ భ్రష్టుపడుతున్నది.., కాదు మీ వల్లే జనగామలో కాంగ్రెస్ సర్వనాశనం అవుతున్నది’ అంటూ పరస్పరం వ్యక్తిగతంగా దూషించుకున్నారు.