దేవరుప్పుల, ఏప్రిల్ 28 : సమష్టి కృషితో బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సభ సక్సెస్ కావడంతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సభ విజయవంతం కోసం చెమటోడ్చి పనిచేశారని, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కనిపించిందన్నారు. బీఆర్ఎస్పై జనంలో ఊపు ఉన్నదని, కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ సభ ద్వారా రుజువైందన్నారు.
లక్షల్లో ఉన్న జనాన్ని సభలో చూస్తుంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ సభలు కళ్లముందు కదలాడాయన్నారు. కేసీఆర్ మాటల తూటాలతో కాంగ్రెస్ నాయకుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. సభను సక్సెస్ చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కార్యకర్త నుంచి నాయకుడి వరకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సభా ప్రాంగణం చేరకుండానే ట్రాఫిక్ జామ్తో లక్షలాది మంది కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయారని అన్నారు. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి కావాలని, తెలంగాణ అభివృద్ధి పథంలో వికసించాలనే ఆకాంక్ష జనంలో కనిపించిందన్నారు.
స్వచ్ఛందంగా కదిలిన జనాన్ని చూస్తుంటే రేవంత్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత బయటపడిందని ఎర్రబెల్లి అన్నారు. ఇక ముందు ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ గెలుపు ఖాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ సర్కారుకు వణుకు పుట్టడం ఖాయన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాల వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తే తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తాను చెప్పగానే స్వచ్ఛందంగా ఉప్పెనలా కదలివచ్చిన అందరికీ రుణపడి ఉంటానన్నారు.