సుబేదారి, డిసెంబర్ 8 : వరుస హత్యలు, దాడులు, దోపిడీలతో వరంగల్ వణుకుతున్నది. పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజు ఏదో ఒక చోట హత్య లేదా హత్యాయత్నం, చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇక వరంగల్ నగరంలో నేరాలు నిత్యకృత్యంగా మారాయి. ఇటీవల ఒకే రోజు మట్టెవాడ పోలీసు స్టేషన్ పరిధి రంగంపేట ప్రాంతంలో కారులో హత్యకు గురైన వృద్ధుడి మృతదేహం లభించడం, కాజీపేట పోలీసు స్టేషన్ పరిధి బాపూజీ నగర్లో మరో వృద్ధుడిపై ఓ యువకుడు కత్తితో దాడిచేసిన ఘటనలు కలకలం రేపాయి.
ఇదిలా ఉంటే నగరంలో కొందరు రౌడీషీటర్లు మళ్లీ రెచ్చిపోతూ అమాయకులపై దాడికి పాల్పడుతున్నారు. నగరంతోపాటు, కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజూ దోపిడీలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం కాజీపేట పోలీసు స్టేషన్ పరిధి ప్రశాంత్‌నగర్‌లో ఓ కుటుంబం బయటకు వచ్చి గంటలోపే ఇంటికి చేరుకునే సరికి పెద్ద ఎత్తున బంగారం చోరీ జరిగింది.
రాయపర్తి పరిధిలో ఎస్బీఐ బ్యాంకులోని బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇలాంటి తీవ్రమైన నేరాలను నియంత్రించడంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఇక కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు నేరస్వభావం, హత్యా నేరాల్లో నిందితులుగా ఉన్న ఖద్దరు చొక్కా లీడర్లకు సపోర్ట్ చేయడంతో వారి మాటున రౌడీలు రెచ్చిపోయి దందాలకు పాల్పడుతున్నారు.
నేరాల నియంత్రణ విషయమై సీపీ అంబర్ కిశోర్ ఝా కఠినంగా ఉన్నప్పటికీ కింది స్థాయి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తీవ్రమైన కేసుల దర్యాప్తు విషయంలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నెలల తరబడి నిందితులను పట్టుకోవడం లేదని తెలుస్తున్నది. కొన్నేళ్ల క్రితం వరంగల్ నగరంలో రౌడీలు అధిపత్య పోరు, ఉనికి కోసం రౌడీయిజం చేసేవారు. ఇది పరస్పర దాడులు, హత్యలకు దారి తీసింది. అప్పటి పోలీసు అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించి ఉక్కుపాదంతో అణిచి వేసి కరుడుకట్టిన రౌడీషీటర్లను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర వరంగల్ పోలీసులది. ఎన్నో కేసులను ఛేదించి పేరు తెచ్చుకున్నారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ గతి తప్పుతున్నది. ప్రధానంగా భూతగాదాలు, వివాహేతర, ఆర్థిక సంబంధాలు, క్షణికావేశం, ఆధిపత్యం కోసమే నేరాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. పొలిటికల్ సపోర్ట్‌తో పోస్ట్ తెచ్చుకున్న కొందరు అధికారులు రోజువారీ సంపాదనపైనే దృష్టిపెడుతున్నారని, ఉన్నంత కాలం ఏదో అలా పనిచేశామనిపించునే ధోరణే తప్ప నేరాల అదుపునకు నిఘా పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి.
అయితే పోలీసు శాఖలో పదేళ్లలో అనేక సంస్కరణలు వచ్చాయి. కొత్త వాహనాలు, టెక్నాలజీ, సైబర్ నేరాలకు ప్రత్యేకమైన వ్యవస్థ, మహిళలు, బాలికల రక్షణ కోసం షీ టీంలు, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక విభాగం, నేరస్తులను సులువుగా పట్టుకోవడానికి సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి అత్యాధునిక వసతులతో లా అండ్ ఆర్డర్లో పనిభారం తగ్గడంతో పాటు పోలీసుల సంఖ్య కూడా పెరిగింది. అయినప్పటికీ కమిషనరేట్ పరిధిలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 2 వరకు 34 హత్యలు, 96 హత్యాయత్నాలు, 20 దోపిడీలు,18 చైన్ స్నాచింగ్‌లు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.