తన ప్రేమ విషయం తెలిసి మందలించడంతో ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని కన్నతల్లినే కడతేర్చిందో కూతురు. పదో తరగతి చదివే వయస్సులోనే ఇన్‌స్టాలో పరిచయమైన వాడితో ప్రేమలో పడి తల్లి అని కూడా చూడకుండా పక్కా పథకం ప్రకారం దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డ బాలిక.. ముగ్గురూ మైనర్లే కావడం విస్తుగొల్పుతోంది. ఈ సంఘటన హైదరాబాద్ జీడిమెట్లలో సోమవారం సాయంత్రం జరుగగా మృతురాలు సాంస్కృతిక సారథి కళాకారిణి సట్ల అంజలి(36) స్వగ్రామం ఇనుగుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది.
– ఇనుగుర్తి, జూన్ 24
మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రానికి చెందిన సాంస్కృతిక సారథి కళాకారిణి సట్ల అంజలి(36) తన కూతురు చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. అంజలి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటపాటలతో ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొని అనేక మందిని చైతన్య పరిచింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. పదో తరగతి చదువుతున్న అంజలి కుమార్తె తేజశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నల్లగొండకు చెందిన శివతో ప్రేమలో పడింది.
ఐదు రోజుల క్రితం ప్రియుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తల్లి అంజలి పోలీసులకు చేయగా, ప్రియుడు బాలికను తీసుకెళ్లి అప్పగించాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న తేజశ్రీ తల్లిని చంపాలని నిర్ణయించుకుంది. సోమవారం సాయంత్రం ప్రియుడు, అతని తమ్ముడు యశ్వంత్‌తో కలిసి పూజ చేస్తున్న అంజలిపై దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేశారు. అనంతరం శ్వాస ఆడకుండా మొఖంపై దిండు ఉంచి గొంతు పిసికారు. అనంతరం సుత్తెతో తలపై, నుదిటిపై బలంగా కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు.
కన్న కూతురే ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసి ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై ఇనుగుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. తేజశ్రీ, శివ, యశ్వంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి మండల కేంద్రానికి చేరుకున్న అంజలి మృతదేహానికి మహబూబాబాద్ జిల్లా డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కంబాలపల్లి సత్యనారాయణ, కళాకారులు కొమ్మిరే వెంకన్న, గిద్దె రాంనర్సయ్య, మెరుగు రవీందర్, దర్శనం యుగేంధర్ తదితరులు ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంజలి అంత్యక్రియలు ఇనుగుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహిస్తామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.