హనుమకొండ చౌరస్తా, మే 29: కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుతానని, వీధి, చిరువ్యాపారుల జోలికి వెళ్లొద్దు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. చిరు వ్యాపారుల హక్కులను కాల రాయొద్దని, చిరు వ్యాపారుల చట్టం, వారికి హక్కులు ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో అన్ని ర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు ముత్తోజు సత్యనారాయణరావు సంస్మరణ కార్యక్రమాన్ని కార్మిక మాసోత్సవాల్లో భాగంగా గురువారం లష్కర్‌బజార్ హమాలీ అడ్డా వద్ద నిర్వహించారు.
మొదట సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ తల్లి రాజేశ్వరికి, భార్య నిర్మలకి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సత్యనారాయణతో 30 ఏండ్ల అనుబంధం, కార్మికుల హక్కుల సాధన కోసం సత్యనారాయణరావు పోరాడారని గుర్తుచేశారు. ఆర్టీసీలో పనిచేసినప్పుడు ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం కొట్లాడారని, పదవీ విరమణ పొందిన అనంతరం సైతం రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడారన్నారు.
కార్మిక మాసోత్సవాల్లో భాగంగా సత్యనారాయణ పేరిట కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, కార్మికులకు అన్నదానం నిర్వహించారు. కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయని, కార్మిక, కర్షకుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న దాస్యం వినయ్భాస్కర్ని హనుమకొండ రస్తా చిరువ్యాపారులు కలిసి వారి గోడు వెల్లబోసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొర్రె విజయ్, కార్మిక నాయకులు నాయిని రవి, రవీందర్‌రెడ్డి, సంజీవ్, ఇస్మాయిల్, రాజు, భిక్షపతి, శివకుమార్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.