హనుమకొండ, నవంబర్ 11 : కేసులు, అరెస్టులు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న బెదిరింపులకు భయపడేది లేదని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ప్రభుత్వం ప్రతీకారం మాని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సోమవారం ఆయన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికి అన్యాయం చేస్తే ఊరుకోమని అన్నా రు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందేనన్నారు. ప్రజలకిచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల అమలు విషయమై ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా పోరాడతామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు మంగళం పాడాలని కాంగ్రెస్ ప్రభు త్వం చూస్తున్నదని ఆరోపించారు. ఆదివారం హనుమకొండకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై స్థానిక కాంగ్రెస్ నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము, తమ నాయకుడు తెలంగాణ కోసం జైలుకు వెళ్లామని, మీరెందుకు వెళ్లారో ప్రజలకు తెలుసన్నారు.
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వ్యక్తిగత దూషణలు, దాడికి దిగుతున్నాడన్నారు. ప్రశ్నిస్తే మూసీలో కలిపేస్తాం.. బుల్డోజర్లతో తొకిస్తాం అంటూ కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను, సీఎం, మంత్రులు, నాయకుల మాటలను గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దానిపై మాట్లాడుతున్నారని, కూల్చాలనుకుంటే కూల్చండని, తాము సహనంతో ఉన్నామని, రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. ఇంటింటా సర్వే చేస్తున్న క్రమంలో అధికారులను ప్రజలు తిడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రూ. 7 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించిందని, లక్ష కోట్ల బడ్జెట్ ఎటు పోయిందని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డే అన్నారని పేర్కొన్నారు. బీసీ, దళిత బంధు ఏమైందన్న తమ ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోయేలా పాలన చేయాలని సూచించారు. కేటీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని దాస్యం అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌పై అడిగితే సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు. సమగ్ర సర్వేను స్వాగతిస్తున్నామని, అభ్యంతరకర ప్రశ్నలపై ప్రజలకు అనుమానాలున్నాయని, ఈ క్రమంలో అధికారులను వారు నిలదీస్తున్నారని అన్నా రు. 2014లో సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియోను విలేకరులకు చూపించారు. వివరాల సేకరణపై అప్పుడొక మాట, ఇప్పుడొక మాటను సీఎం మాట్లాడుతున్నారని, ద్వంద్వ ధోరణి సరైంది కాదన్నారు. నాటి, నేటి మాటలకు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. పత్తికి మద్దతు దక్కడం లేదని, సన్నాలకు బోనస్ రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో చెప్పాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మైనారిటీ నాయకుడు నయీముద్దీన్, నాయకులు రాంమూర్తి, జానకీరామ్, వెంకన్న, రఘు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.