హనుమకొండ, మే 02 : హమాలీ కార్మికుల సేవలు అనిర్వచనీయం.. వస్తువుల సరఫరాలలో కీలక భూమిక పోషిస్తారు. హమాలీల శారీరక శ్రమతోనే ప్రజలందరికి వస్తువులు అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో కాకతీయ హమాలీ సంఘం కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హమాలీల శ్రమతగ్గ వేతనాలు అందడం లేదని, హమాలీలు అసంఘటితమై ఉన్నారని అన్నారు.
వారు సంఘటితం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. హమాలీలను కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి, ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్‌లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. హమాలీ అడ్డాల వద్ద మున్సిపల్ అధికారులు కనీస వసతులు కల్పించాలని కోరారు. హమాలీలు వ్యాపార సంస్థల యాజ మాన్యాలు కూలీ తక్కువ ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇంకా పలు సమస్యలను ఈ సందర్బంగా కార్మికులు వినయ్ భాస్కర్ దృష్టికి తీసుకొచ్చారు.
హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. అనంతరం కాకతీయ హమాలీ సంఘం సభ్యులను శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో కాకతీయ హమాలీ సంఘం అధ్యక్షుడు లింగన్న, ఉపాధ్య క్షుడు సీహెచ్ కుమార్, ఎల్ కుమార్, జి సదయ్య, ఆర్ శ్రీను, సభ్యులు ఎన్ శంకర్, ఎన్ రాజేష్, వీ రవి, దామెర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.