హనుమకొండ, జూన్ 08 : బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా పక్షాన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
గోపీనాథ్ మరణం పార్టీకి తీరని నష్టమని అన్నారు. కేసీఆర్ ఒక సైనికున్ని కోల్పోయారని ఆవేదనను వ్యక్తం చేశారు. గోపీనాథ్ మూడుసార్లు శాసనసభ్యుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకు ఎంతగానో సేవ చేశారని, తనను నమ్ముకున్న పార్టీ శ్రేణులకు సైతం అండగా నిలిచారన్నారు. గోపీనాథ్ తాను సైతం గతంలో శాసనసభ్యునిగా పనిచేశానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, సీనియర్ నాయకులు జానకి రాములు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు ఇమ్మడి రాజు, శ్రీధర్, ప్రశాంత్, రాకేష్ యాదవ్, స్నేహిత తదితరులు పాల్గొన్నారు.