కాచిగూడ, ఫిబ్రవరి 23: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిపాప మృతి ఘటన విషయంలో బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం పసిపాప మృతికి కారుకులైన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా బర్కత్‌పుర చౌరస్తాలో మందలాది విద్యార్థులతో బైఠాయించారు.
దీంతో ఆ ప్రాంతంలో గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మల్లన్న జారత సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలో 2 నెలల పసిపాప మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని, అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని ధ్వజమెత్తారు.పసికందు మృతికి బాధ్యులైన నిందుతులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, శివమ్మతో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.