హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 23 : ప్రభుత్వ రంగ విజయ డెయిరీని నమ్ముకొని పాలు పోసిన పాడి రైతులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రెండు నెలలకు ఒకసారి కూడా రావడం లేదు. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి పాడి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న రైతులు ప్రస్తుతం పశువులకు దాణా కూడా అందించలేకపోతున్నారు.
జనగామ మినహా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని 2 వేల మంది వరకు పాడి రైతులు విజయ డెయిరీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరు సగటున రోజుకు 9 వేల లీటర్ల పాలు పోస్తున్నారు. వీరికి జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి సుమారు రూ. 60 లక్షల వరకు బిల్లులు బకాయి ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
సకాలంలో పాల బిల్లులు అందకపోవడంతో దాణా, మేత ఖర్చులు, ఆవులు, గేదెల కొనుగోలుకు చేసిన అప్పులు, లోన్లు తీర్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పశువులకు రాయితీ దాణాతో పాటు రూ. 4 ప్రోత్సాహకం కూడా అందడం లేదు. అయినప్పటికీ పెండింగ్ బిల్లులు వస్తాయనే ఆశతో అప్పులు తెచ్చి మరీ పశువులను పోషిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పాల ఉత్పత్తి, నాణ్యత విషయంలో విజయ డెయిరీకి మంచి పేరున్నప్పటికీ ప్రైవేట్ డెయిరీలు మార్కెట్లో లీటర్ పాలను రూ. 10 తక్కువకు విక్రయిస్తుండడం ప్రభావాన్ని చూపుతున్నది.
విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించకపోవడానికి పర్యవేక్షణ లేకపోవడమే కారణం. వినియోగదారులకు నమ్మకం లేకపోవడంతో మారెట్లో సేల్స్ పడిపోయాయి. రైతుల నుంచి తీసుకున్న పాలు, పాల పదార్థాలు అమ్మకపోవడం వల్ల నష్టం జరిగింది. హైదరాబాద్ పెద్ద మారెట్ అయినా విజయ డెయిరీ పాత్ర నామమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు సంస్థ రైతులకు రూ. 2 కోట్ల వరకు బాకీ పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పాల బిల్లులు చెల్లించాలి.
రాష్ట్రంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ వ్యక్తిగత లాభాల కోసం తప్ప రైతుల కోసం కాదు. చంద్రబాబు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరులోని విజయ డెయిరీని భ్రష్టు పట్టించి హెరిటేజ్ నిర్మించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అతడికి సహకరిస్తున్నాడు. విజయ డెయిరీని నష్టాల్లోకి నెట్టి మూసివేసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో ఉన్న పాడి రైతులు ఏకమై ప్రభుత్వాన్ని నిలదీసి డెయిరీని నిలబెట్టుకోవాలి.
– ఇరుకు దేవేందర్రావు, విజయ కాకతీయ పాడి రైతుల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు