తాడ్వాయి, ఫిబ్రవరి 5 : మేడారంలో గుడిమెలిగే పండగను బుధవారం సమ్మక్క-సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు అమ్మవార్ల మినీ జాతర జరగనుంది. దీనికి వారం రోజుల ముందు నిర్వహించే ఈ పండుగతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలోని గుట్టపైకి వెళ్లి గడ్డిని సేకరించారు. అనంతరం సమ్మక్క పూజామందిరం వద్దకు చేరుకొని గుడిపై వేసిన అనంతరం ఆడపడుచులు పూజామందిరాలలోని గద్దెలను మట్టితో అలికి ముగ్గులు వేశారు. అమ్మవారి పూజాసామగ్రిని సమ్మక్క పూజారి కొక్కెర క్రిష్ణయ్య భద్రపరిచిన స్థలం నుంచి తీసుకొచ్చి శుద్ధి చేశారు. అమ్మవార్ల మినీ జాతర ముగిసే వరకు పూజారులు, వారి కుటుంబాలు అత్యంత నియమనిష్టలతో నిత్య పూజలు నిర్వహించనున్నారు. అలాగే సమ్మక్క పుట్టిన బయ్యక్కపేటలో చందా వంశీయులు బుధవారం గుడిమెలిగే పండుగను నిర్వహిం చారు. ఉదయమే అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించి తల్లి కొలువైన గుడిని శుద్ధి చేసి అలుకుపూతలు చేసిన అనంతరం గడ్డిని గుడిపై వేసి పూజలు చేశారు.
దొడ్ల, కొండాయిలో మండమెలిగే..
ఏటూరునాగారం : మండలంలోని దొడ్ల, కొండాయి గ్రామాల్లో బుధవారం గోవిందరాజులు, నాగులమ్మ, సారలమ్మ గుడిలో మండమెలిగే కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడిని, ఆవరణను నీటితో శుద్ధి చేసి ముగ్గులు వేశారు. ప్రవేశ ద్వారం వద్ద మామిడి తోరణాలు కట్టారు. గ్రామంలో శారలమ్మ గుడిని అలంకరించడంతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేశారు. ఆయా కార్యక్రమాల్లో పూజారులు వెంకటేశ్వర్లు, గోవర్ధన్, దెబ్బగట్ల గోవర్ధన్, పరుగు రాజారాం తదితరులు పాల్గొన్నారు.
గట్టమ్మకు ఎదురు పిల్ల పండుగ
ములుగు రూరల్ : ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని ఆదిదేవత గట్టమ్మ తల్లికి బుధవారం ఎదురుపిల్ల పండుగను ఆదివాసీ నాయకపోడు పూజారులు, కులస్తులు ఘనం గా నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు నెత్తిన పెట్టుకొని నృత్యాలు, లక్ష్మీదేవరల ఆటలు, పాటలతో భారీ ర్యాలీగా గట్టమ్మ వద్దకు చేరుకున్నారు. ప్రధాన పూజా రి సదయ్య, కులస్తులు బోనాన్ని సమర్పించి లక్ష్మీదేవర, పోతరాజును ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎదురుపిల్లను గట్టమ్మ తల్లికి సమర్పించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ఆపద రాకుండా చల్లగా చూడాలని వేడుకున్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.