భీమదేవరపల్లి, అక్టోబర్ 30: మొంథా తూఫాన్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పై పంజా విసిరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 41.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో భీమదేవరపల్లి మండలంలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దాదాపు గ్రామాల్లోని అన్ని చెరువులు, కుంటలు నిండుకున్నాయి. దశాబ్దాల క్రితం వరకు కూడా ముత్తారం చెరువు నిండ లేదని, ఇప్పుడే చెరువు నిండి మత్తడి పోస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.
రోడ్డున పడ్డ రైతులు..
కొత్తపల్లిలో చెరువు తెగడంతో పోలీసులు, అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా కొత్తకొండ చెరువు పెద్ద ఎత్తున మత్తడి పోయడంతో, చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చేతికొచ్చిన మరి పంట నీట మునిగిందని, కోసిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని చాలా చోట్ల రైతులు కన్నీరు పెట్టుకున్నారు. మండలంలో సుమారు 6030 ఎకరాలు వరి పంట దెబ్బతిందని, 3290 మంది రైతులు రోడ్డున పడ్డారని వ్యవసాయ అధికారుల అంచనా. కొత్తకొండ – గట్లనర్శింగాపూర్, కొత్తకొండ – మల్లారం గ్రామాల్లో ప్రధాన రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
50 ఏండ్ల తర్వాత..
యాభై ఏండ్ల తరువాత ఇంత స్థాయిలో వర్షం పడిందని స్థానికులు చెబుతున్నారు. బొల్లోనిపల్లి గ్రామం జలదిగ్బంధంలో ఉంది. దాదాపు 25 కుటుంబాల్లో ఇళ్లలోకి నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ప్రమాదం ఏర్పడింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించారు. తుఫాన్ దాటికి మండలంలో రెండు ట్రాన్స్పార్మర్స్, 26 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కొప్పూరులో ఒక ఆవు, రెండు దూడలు, మల్లారం గ్రామంలో రెండు ఆవులు మృతి చెందాయి. మండలంలోని 94 చెరువులు, కుంటలు ప్రమాదంలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. అసుర పంజా విసిరిన మొంథా తుఫాన్ దాటికి తల్లడిల్లుతున్న అన్నదాతలను, నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల ప్రజలు అర్థిస్తున్నారు.