హనుమకొండ సబర్బన్, నవంబర్ 13 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొంథా తుపాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గ్రేటర్ వరంగల్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోని రైతులను పెద్ద ఎత్తున నష్టపరిచింది. ప్రభుత్వ ఆదేశం మేరకు 35 వేల ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను అందజేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇవి మాటలకే పరిమితం కాగా.. పంట నష్టం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నాలుక మడతేసింది. రైతులపై పగబట్టిన సర్కారు కేవలం 11 వేల ఎకరాల్లోనే పంట దెబ్బతిన్నదంటూ ఆ మేరకే పరిహారం ఇచ్చేందుకు రికార్డులను సిద్ధం చేసింది.
గ్రేటర్ వరంగల్‌తో పాటు హనుమకొండ జిల్లాలో మొంథా తుపాను ప్రభావ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు క్షేత్రస్థాయి పర్యటించారు. నగరంలో కూలిపోయిన, ముంపునకు గురైన ఇండ్లతో పాటు పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని హామీలిచ్చారు. అయితే సాయం కోసం ఆశగా ఎదురుచూసిన నగరవాసులు, రైతులకు అడియాశే ఎదురైంది. విపత్తు సంభవించి 15 రోజులైనప్పటికీ హామీలు అమలు చేయడంలో ఏమాత్రం అంకితభావం కనిపించడం లేదు. నగరంలో దెబ్బతిన్న, ముంపునకు గురైన ఇళ్లను తక్కువ చూపించిన అధికారులు నష్టపోయిన పంటల అంచనాలోనూ అదే పద్ధతిని అవలంబించారు.
హనుమకొండ జిల్లాలో 33,348 ఎకరాల్లో వరి, 750 ఎకరాల్లో పత్తి, 620 ఎకరాల్లో మక్కజొన్న, మొత్తంగా 35 వేల ఎకరాలకు పైచిలుకు పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను సైతం మార్చివేశారు. ప్రస్తుతం కేవలం 10,778 మంది రైతులకు సంబంధించిన 11,031 ఎకరాల్లోనే నష్టం వాటిల్లినట్లు రిపోర్టును సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశం మేరకే భారీగా నష్టం శాతాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తగ్గించినట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే అన్ని పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని ముందుగా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం వరిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని పత్తి, మిర్చి, మక్కజొన్న పంటలను పక్కకుపెట్టడం విశేషం.
హనుమకొండ జిల్లాలోని మొత్తం 14 మండలాల్లో వరి తర్వాత పత్తి ప్రధాన పంటగా ఉంది. మెట్ట ప్రాంతాలైన వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ఐనవోలు మండలాలతో పాటు శాయంపేట, ఆత్మకూరు, దామెర మండలాల్లో రైతులు 50 వేలకు పైగా ఎకరాల్లో పత్తి పంట సా గు చేస్తారు. అయితే కాటన్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని కేవలం పరకాలలో ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లలేని రైతులు పంటను ప్రైవేట్ వ్యాపారులకు అగ్గువకు అమ్ముకుంటున్నారు. జిల్లాలోని 8 మండలాలకు కూడలిగా ఉండే ఎల్కతుర్తిలో గతంలో కొనసాగించిన సీసీఐ కేంద్రాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయలేదు. ఈ కేంద్రం సిద్దిపేట జిల్లా సీసీఐ అధికారుల పర్యవేక్షణలో ఉంటుండగా, కేవలం కమీషన్ల కారణంగానే ఈ సెంటర్‌కు మోక్షం రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.