శాయంపేట, అక్టోబర్ 28 : శ్రీరాంసాగర్ జలాలపై ఆధారపడి సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఆయకట్టుకు నీళ్లు చేరకపోవడంతో చివరి తడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. శాయంపేట పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం 31 ప్రధాన కాల్వ, ఉప కాల్వ మైలారం శివారు వరకు ఉంది. జూన్లో కాల్వ నీళ్ల ఆధారంగా రైతులు వరి పంటను సాగుచేశారు.
శ్రీరాంసాగర్ జలాలు 1ఆర్ ఉప కాల్వ చివరకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. శాయంపేట శివారులో వరి పంటకు నీళ్లు అందక ఎండిపోతున్నట్లు రైతులు చెప్పారు. 15 రోజులకు ఒకసారి అరకొరగా కాల్వల్లో నీళ్లు రావడంతో తడి పెట్టుకున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండగా నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కాల్వల్లో కొద్దిపాటిగా వస్తున్న నీళ్లు బుంగ పడి వృథాగా పోయాయి.
రైతులే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసుకున్నట్లు చెప్పారు. మొరం తెప్పించి జేసీబీతో బుంగను పూడ్చేసినట్లు దీంతో వచ్చే అరకొర నీటితో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని వాపోయారు. కాల్వల నిండా తుమ్మ చెట్లు, పిచ్చిమొక్కలు, గడ్డి పెరగడంతో నీళ్లు చివరి వరకు రావడం కష్టంగా మారింది. కొన్నేండ్లుగా ఎస్సారెస్పీ అధికారులు కాల్వల పరిస్థితిని కన్నెత్తి చూసిన దాఖలాలు లేవంటున్నారు. మరికొంతమంది రైతులు వ్యవసాయబావుల నుంచి రూ. 2,500 చెల్లించి నీటిని కొనుక్కొని పారించుకుంటున్నట్లు చెప్పారు.