జఫర్‌గఢ్, మార్చి 13 : సీఎం రేవంత్‌రెడ్డికి 20 శాతం కమీషన్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. చేతకాని కాంగ్రెస్ ప్రభు త్వ విధానాల వల్ల రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు సాగునీరు లేక ఎండుతున్నాయన్నారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లిలో ఎండిన వరి, మక్కజొన్న పంటలు, దేవాదుల కెనాల్ దుస్థితిని గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. పంటలు ఎండిన రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
దేవాదుల కెనాల్లో నీళ్లు లేక గడ్డి పెరగడంతో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనను రైతులతో కలిసి గుర్తు చేసుకున్నారు. రైతులతో కలిసి కెనాల్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాం లో రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండలేదన్నారు. స్టేషన్ ఘనఫూర్ నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లున్నా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టింపులేని తనంవల్ల పంటలు ఎండుతున్నాయన్నారు.
ఆయన రైతులను పట్టించుకోవడం మానేశాడని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్‌రెడ్డి పాలనకు, గత పదేళ్ల కేసీఆర్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రైతులను ఆదుకోని సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీరు అందించలేని మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ సభల పేరుతో నియోజకవర్గానికి రావడం సిగ్గుచేటన్నారు. రైతులకు సాగునీరందించి, అన్ని వర్గాల ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాక స్టేషన్‌ఘన్‌పూర్ గడ్డపై అడుగు పెట్టాలన్నారు. ఈ నెల 16కు ముందే సాగునీరు విడుదల చేయాలని, లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని రాజయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మహేందర్‌రెడ్డి, మారపాక రవి, సోమిరెడ్డి, జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.