జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. మొత్తం 1.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి, 100 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా, అధికారులు ఎలాంటి పంట నష్టం జరుగలేదని చెబుతున్నారు.
2865 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. వీటిపై ఇంతవరకు ఫీల్డ్ మీదికి వెళ్లి సర్వే చేయలేదు. యూరియా పంపిణీ అధికారులకు తలనొప్పిగా మారగా పంట నష్టం సర్వేను పక్కన పెట్టేశారు. సుమారు 10 ఎకరాల్లో నాటిన మిర్చి మొక్కలు కొట్టుకుపోయాయని, తిరిగి మళ్లీ నాటుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో పత్తి, మకజొన్న, పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించక పోవడం గమనార్హం. పత్తి చేలల్లో నిలిచిన నీటితో ఎర్రబడ్డాయి. దాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. కోయడానికి సిద్ధంగా ఉన్న పెసర పంటను వరద నీరు ముంచెత్తడంతో మురిగిపోయింది.
ఒక కేసముద్రం మండలంలోనే సుమారు 150 మంది రైతుల పెసర పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి నష్టపరిహారం మాట అలా ఉంచితే కనీసం అటువైపు వెళ్లి పంట ఎలా ఉంది అని చూసిన అధికారులు లేకుండా పోయారు. పెసర పంట మొత్తం పాడవడంతో వేరే పంటలు సాగు చేసేందుకు రైతులు భూమిని చదును చేస్తున్నారు.