నర్మట, మే 6 : మండలంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లోని నర్మెట, వెల్దండ, అమ్మాపూర్, మచ్చుపాడు, కన్నబోయిన గూడెం, హనుమంతపూర్, మల్కాపేట, గండి రామవరం తదితర గ్రామాల్లో మామిడి తోటల్లో మామిడికాయలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కన్నబోయిన గూడెంలోని శ్రేష్ఠ రైస్ మిల్ రాత్రి కురిసిన గాలివానకు పైకప్పు లేచిపోయి పక్కనే ఉన్న మామిడి తోటలో పడింది.
పైకప్పుతోపాటు రైస్ మిల్లులోని ధాన్యంతో పాటు యంత్రాలు దెబ్బతిన్నాయి. నర్మెట్ట – వెల్దండ రహదారి పై చెట్లు కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అదేవిధంగా నష్టపోయిన రైస్ మిల్ ఓనర్ మహిపాల్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.