నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 31 : ‘కష్టమంతా నీటి పాలైంది. చేతికొచ్చే దశలో వరి చేను మోకాలు లోతు నీళ్లల్ల ఉంది. వారం రోజు లైనా పంటల్లో నీరు పోయేటట్లులేదు. ఇప్పుడేమి చేయాలో అర్థమైతలేదు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనం. వడ్లు అమ్మి కాసింత అప్పు కట్టి బరువు దింపుకుందమనుకున్నం. కానీ ఈ తుపాన్ నిలువునా ముంచింది. ప్రభుత్వం ఆదుకోకపోతే సావే దిక్కయితది’ అని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వరంగల్ లో ఇంతకు ముందు ఎన్నడూ ఇలా నీళ్లు రాలేదు. ఇంట్లోకి నీళ్లు రావడంతో బంగ్లాలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం. రోజంతా తిండి నీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపినం. ఉదయం పోలీసులు, అధికారులు వచ్చి పునరావాస కేంద్రానికి తీసుకపోయి అన్నం పెట్టిన్రు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు తగ్గాయని సామాను కడుక్కుంటున్నాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం’ అని నగరవాసులు చెప్పుకొచ్చారు.
హనుమకొండ చౌరస్తా : ఇంతకుముందు ఎన్నడూ ఇలా నీళ్లు రాలేదు. అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. కాలనీ చెరువులా మారింది. అలంకార్ జంక్షన్ బ్రిడ్జి నుంచి కాకతీయ కాలనీ వరకు మునిగిపోయింది. కేయూ బైపాస్ రోడ్ వరకు నీళ్లు వచ్చాయి. మేం 12 మంది ఇక్కడే గుడిసెలో ఉన్నాం. నీళ్లు వచ్చి ఇల్లు మునిగిపోయింది. దీంతో అందరం పకన ఉన్న బంగ్లా మొదటి అంతస్తులో ఎకి ప్రాణాలు కాపాడుకున్నం.
– జూని మహేందర్ సింగ్ కుటుంబ సభ్యులు, కాకతీయకాలనీ, హనుమకొండ
కరీమాబాద్ : రెండు రోజుల క్రితం వాన వచ్చింది. తగ్గుతది అనుకుని దగ్గర ఉన్న నా కొడుకు ఇంటిలో ఉన్నా. వాన అసలే తగ్గలేదు. రోజంతా తిండి నీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపినం. తెల్లారి పోలీసులు, అధికారులు వచ్చి బడిలోకి తీసుకుపోయి అన్నం పెట్టిన్రు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు తగ్గినయని సామాను కడక్కుంటున్నాం.
– తాళ్ల ఉపేంద్ర, ఎన్ఎన్ నగర్ కాలనీ, వరంగల్
భీమదేవరపల్లి : మొంథా తుపాను మా సావుకే వచ్చిం ది. నాకు 1.17 ఎకరాల ఎవుసం భూమి ఉంది. పిల్ల ల సదువులు, రోగం వత్తె దవాఖాన ఖర్చులు, పొట్ట తిప్పలుకు అప్పులు బాగా పెరిగినయ్. దీంతో ఈ ఫసల్కు 1.20 ఎకరాలు భూ మి కూడా కౌలుకు తీసుకుని వరి పంట వేసిన. పొట్టకచ్చింది. ఇగ పంట కోయాలే అనే సమయానికి తుపాను మోపైంది. పంట మొత్తం నేలపాలైంది. వడ్లు అమ్మి అయినా కాసింత అప్పు కట్టి బరువు దింపుకుంట అనుకున్న. మాబోటి రైతులు చాలా మంది ఇట్లనే ఉన్నరు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకు సావే దిక్కయితది.
– గుడికందుల మోహన్, రైతు, ముల్కనూరు, భీమదేవరపల్లి మండలం,
అప్పు చేసి పదెకరాల్లో వరి సాగు చేసిన. తుపానులో చేతికందే పంట నాశనమైంది. ఇప్పటివరకు రూ. మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. వర్షంతో పంటంతా నేలకొరిగింది. చేసిన అప్పులే మిగిలినయ్. ఏం చేయాలో అర్థమైతలేదు. ప్రభుత్వం ఆదుకొని నష్ట పరిహారం ఇవ్వాలి.
– తడకల సతీశ్, రైతు, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్
ఎల్కతుర్తి : తుపాను వల్ల ఇల్లు కూలింది. దీంతో మా కుటుంబం రోడ్డున పడ్డది. ఇప్పుడు ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వస్తువులన్నీ తడిసిపోయినయి. ఇల్లు కూలి రూ. 50వేల వరకు నష్టం వాటిల్లింది. అధికారులు వచ్చి చూసిపోయిండ్రు. ఇంటి రిపేరు కోసం నష్ట పరిహారం ఇవ్వాలె. లేకుంటే ఇందిరమ్మ ఇల్లు అయినా మంజూరు చేసి ఆదుకోవాలి.
– గబ్బేటి సరోజన, దామెర, ఎల్కతుర్తి మండలం