రాయపర్తి, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లతో కష్టాల సాగు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అధ్యక్షతన శుక్రవారం రాయపర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టాయి. పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ఎర్రబెల్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ఏలుబడిలో రైతులు యూరియా బస్తాలు లేక, నాణ్యమైన విద్యుత్ సరఫరా కాక, సమృద్ధిగా సాగు జలాలు అందించకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు.
అబద్ధపు పునాదులు, మోసపూరిత వాగ్ధానాలతో అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజలను మోసగించడమే తప్ప ప్రజాప్రయోజనాలు పట్టడం లేదని ఆరోపించారు. ఖరీఫ్ ఆరంభానికి ముందే రైతులకు కావాల్సిన ఎరువులను గోదాముల్లో నిల్వ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల ముంగిట్లోకే అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా, పండిన పంటలకు అందుబాటులో మార్కెట్లు తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులు, ప్రజా సమస్యలను పరిష్కరించేంత వరకు తమ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు.
రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు ముత్యం రాజేందర్, మేరుగు రాజు పోలీసులతో కలసి ఎర్రబెల్లిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎర్రబెల్లిని అరెస్ట్ చేయడంతో గులాబీ శ్రేణులు, బాధిత రైతులు పోలీస్ వాహనాలకు అడ్డుతగలడంతో రాయపర్తిలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, కర్ర రవీందర్‌రెడ్డి, లేతాకుల రంగారెడ్డి, కొయ్యాడ సుబ్బారావు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, నాగపురి రాంబాబు, బొడ్డు రంగయ్య, చిలువేరు సాయిగౌడ్, మహ్మద్ అక్బ ర్, మహ్మద్ అష్రఫ్పాషా, అయిత రాంచందర్, బండి రాజబాబు, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్, సతీష్, వేణు, ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్లస్వామి, చిట్యాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.