కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి పోర్టల్ అక్రమాలకు అడ్డాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 మండలాల్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలను కాపాడేందుకే తూతూ మంత్రంగా కొందరు ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసును నీరుగార్చిండ్రు. -హరీశ్‌రావు
జనగామ, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ధరణిపై బురదజల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం భూ హారతిగా మారిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. అధికార పార్టీ పెద్ద తలలు, ఉన్నతాధికారుల ప్రమేయంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన పోర్టల్ స్కామ్‌పై వెంటనే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో పెట్టి సెటిల్మెంట్ పేరుతో కోట్లు వసూళ్లు చేశారని, డబ్బులు ముట్టాక జాబితా నుంచి సర్వే నంబర్‌ను నిషేధిత జాబితా నుంచి తీసేశారని సంచలన విషయాలు బయటపెట్టారు. సర్కార్‌కు దమ్ముంటే రెండేండ్ల నిషేధిత భూములపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, ఎడవెల్లి కృష్ణారెడ్డితో కలిసి హరీశ్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంటూ తెచ్చిన భూ భారతి పోర్టల్ అక్రమాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. పోర్టల్‌లో జరిగిన కుంభకోణంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలోనే రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, రైతులను నిలువునా మోసం చేస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. ధరణిని రద్దు చేసి తెచ్చిన భూ భారతితో ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందని వాపోయారు. ‘ధరణి పోర్టల్‌లో లోపాలున్నాయంటూ పదే పదే విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో భూ భారతి తెచ్చామని గొప్పలు చెప్పింది. కానీ, ఆ పోర్టల్ ఇప్పుడు ఖజానాకు గండి కొడుతూ దళారులకు భూ హారతి పడుతున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పూర్తి డబ్బులు కడుతుంటే, భూ భారతి పోర్టల్ ఎడిటింగ్ ఆప్షన్ వాడుకొని కేవలం 10 శాతమే ప్రభుత్వానికి చెల్లించి, మిగతా 90 శాతం దళారులు జేబుల్లో వేసుకున్నరు’ అని హరీశ్ విమర్శించారు. ఈ 90 శాతాన్ని కూడా చెల్లించాలంటూ రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేశారని వాపోయారు. మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో భూ భారతి సామ్‌ను మీడియా వెలికి తీసిందని, ఇప్పటి వరకు దీనిపై సీఎం సమీక్షించలేదని, ఎంత స్కామ్ జరిగిందో రెవెన్యూ మంత్రి ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు.
‘మూడు జిల్లాల్లోనే ఇంత అవినీతి జరిగితే రాష్ట్రం మొత్తం ఎంత జరిగిందో? దీని వెనుక ఎవరెవరు ఉన్నారో? బయటపెట్టాలని పేలని బాంబుల మంత్రిని డిమాండ్ చేస్తున్నా’ అంటూ ధ్వజమెత్తారు. ‘బీఆర్ఎస్ నాయకులపై సిట్, కమిషన్లు, సీఐడీ విచారణలు అని వేధిస్తున్నరు. కానీ, 35 మండలాల్లో సామ్ జరిగితే ఒక విచారణ కూడా లేదు. భూ భారతి పోర్టల్ ఎడిట్ ఆప్షన్ ఓ ఆపరేటర్‌కు ఎలా దొరికింది? అతడి చేతికి ఆ కోడ్ ఎలా పోయిందో తెలిసినా ఎందుకు బయటపెట్టడం లేదు? దీని వెనుక కాంగ్రెస్ బడా నాయకులు, ఉన్నతాధికారులు ఉండటం వల్లే ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నది’ అని మండిపడ్డారు. ఈ కుంభకోణం వెనుక అధికార కాంగ్రెస్ నాయకులు, పెద్ద అధికారుల హస్తం ఉన్నదని, వాళ్ల పేర్లు బయటకు రాకుండా కవర్ చేయడానికే నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టడానికి కమిషన్ల మీద కమిషన్లు, సిట్లు వేస్తున్న రేవంత్‌రెడ్డి.. భూ భారతి కుంభకోణం, ప్రభుత్వ ఖజానా లూటీపై సిట్‌తో ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు. దీనిపై వెంటనే సిట్ వేసి దోషులను కఠినంగా శిక్షించి ఖజానాకు రావాల్సిన ప్రతి పైసను రాబట్టాలని డిమాండ్ చేశారు.
నాడు రూపాయి ఖర్చు లేకుండా పాస్‌బుక్‌లు
కేసీఆర్ హయాంలో 6.18 లక్షల మంది రైతులకు రూపాయి ఖర్చు లేకుండా సాదా బైనామాలు చేసి పాస్‌బుక్‌లు ఇచ్చామని, రెండో విడత కోసం 8.92 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే కోర్టు కేసులతో అప్పట్లో ఆగిపోయాయని హరీశ్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లేని విధంగా భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్‌పైన అఫిడవిట్ ఇవ్వాలనే కొత్త నిబంధన పెట్టి సాదా బైనామాకు ఉరితాడు బిగించిందని విమర్శించారు. ఆ నిబంధన వల్ల ఇప్పటివరకు ఒక రైతుకు కూడా సాదా బైనామా కాలేదని, వెంటనే ఆ బాండ్ పేపర్ నిబంధన తొలగించి పెండింగ్‌లో ఉన్న 8.92 లక్షల మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రిజిస్ట్రేషన్ అయిన వారానికే పాస్ బుక్ నేరుగా ఇంటికి వచ్చేదని, ఇప్పుడు ఆన్లైన్, ఎన్ఐసీ సాఫ్ట్వేర్ అంటున్నారని, ఎందుకు ఇవన్నీ ఫెయిల్ అయ్యాయో రెవెన్యూ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పేదలకు ఇచ్చిన లక్ష ఎకరాల ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను గుంజుకున్నారని, పేదల ఇండ్లు కూలగొట్టడం, కేసీఆర్ కట్టిన గూడులను కూలగొట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా మారిందని ధ్వజమెత్తారు.
రైతుల నోట్లో మట్టి కొట్టారు : పల్లా
మీసేవ నిర్వాహకులు, స్లాట్ బుకింగ్ సెంటర్ల యజమానులతో అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి, రైతుల నోట్లో మట్టికొట్టారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించి స్లాట్ బుకింగ్ సమయంలో ఎన్ని పైసలు కట్టాలో మీసేవలో నిర్ధారిస్తే, డబ్బులు చెల్లించిన తర్వాత ఫైల్ తహసీల్దార్ వద్దకు వెళితే ఆయన చూసి సంతకం చేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. లక్ష రూపాయలు ఫీజు చెల్లిస్తే, రూ.వెయ్యి ఖజానాకు జమ చేసి మిగిలిన రూ.99 వేలు అందరూ కలిసి నొక్కేశారని, ఇదంతా రెండేండ్లుగా జరుగుతున్నా రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు కండ్లు మూసుకున్నారని దుయ్యబట్టారు. దీనిపై జనగామ తహసీల్దార్‌కు తొలిసారి ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని, దీని వెనుక రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పెద్దల ఒత్తిడి ఉన్నదని చెప్పారు.
యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈ కుంభకోణం ఎక్కువ జరుగుతున్నదని పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు రాసి గగ్గోలు పెడితే, కొంతమంది మీసేవ నిర్వాహకులు, స్లాటు బుకింగ్ ఏజెంట్లపై కేసులు నమోదు చేసి తక్కువ స్టాంపు డ్యూటీ చెల్లించారని రైతులకు రెవెన్యూశాఖ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. రైతులు నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో స్టాంపుడ్యూటీ డబ్బులు చెల్లించినా మీసేవ కేంద్రాలు, స్లాటు బుకింగ్ నిర్వాహకులు, అధికారులు కాజేశారని, దీనికి రైతులను బాధ్యులను చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హరీశ్‌రావు మీడియా సమావేశానికి బాధిత రైతులను రానివ్వకుండా ప్రభుత్వం భయపెట్టి, వెనక్కి పంపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్లాట్ బుకింగ్ సమయంలో పూర్తి మొత్తం చెల్లించినా తహసీల్దార్ వద్దకు వెళ్లిన ఫైల్లో లక్షకు బదులు వెయ్యి రూపాయలు, రూ.90 వేలకు బదులు రూ.9 వేలు చెల్లించినట్టుగా స్పష్టంగా కనిపించినా అధికారులు ఎందుకు కండ్లు మూసుకున్నారని ప్రశ్నించారు. అక్రమాలకు నిలయమైన భూభారతిని రద్దు చేసి ఈ కుంభకోణంలో భాగస్తులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్వేత పత్రం విడుదల చేయాలి
‘కాంగ్రెస్ రాగానే విలువైన భూములను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం.. వసూళ్లు కాగానే తీసేయడం నిత్యకృత్యంగా చేసుకున్నది. ఇలా జాబితాలో పెట్టిన భూములు కోటి ఎకరాలు దాటినయ్. దీని వెనుక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రమేయం ఉన్నది. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టారో?, ఎన్ని తొలగించారో? శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు. ‘పేలని బాంబుల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొదలు మండలస్థాయి అధికారుల వరకు అందరూ కలిసి నిషేధిత భూముల పేరుతో కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారలేదని, అసలు నిషేధిత జాబితాలో ఎన్ని ఎకరాల భూములు పెట్టారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నాడు నాట్లకు రైతుబంధు.. నేడు ఓట్లకు..
కేసీఆర్ హయాంలో నాట్లు వేసే సమయంలో రైతుబంధు సాయం అందిస్తే.. రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ఓట్ల సమయంలో మాత్రమే రెండేండ్లలో మూడు సార్లు ఎగ్గొట్టి, రెండు సార్లు డబ్బులు వేసిందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘వందల కోట్లు పెట్టి క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, అందాల పోటీలు పెట్టొచ్చు, వేల కోట్లతో పారులు కట్టొచ్చు, ఫుట్ బాల్ ఆడేందుకు డబ్బులుంటయి, మూసీ కోసం డబ్బులుంటయి.. కానీ, రైతుల ఖాతాల్లో రైతుబంధు వేసేందుకు మాత్రం రేవంత్‌రెడ్డికి డబ్బుల్లేవా?’ అని నిలదీశారు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటే కచ్చితంగా రైతుబంధు వేసేవాడని చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తకువ నీటిని వినియోగించుకుంటున్నదని, ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా మన నీళ్లను మళ్లిస్తుంటే రేవంత్‌రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నాడే తప్ప ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కండ్ల గుడ్లు ఊడబీకుతా అని డైలాగులు కొట్టడం కాదు.. చేతనైతే కేంద్ర మంత్రి దగ్గర కూర్చుని ఆ నీటి దోపిడీని అడ్డుకో.. తెలంగాణ నీటి వాటాను కాపాడు’ అని సవాల్ చేశారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఇలాగే వదిలేస్తే రేపు హైదరాబాద్‌కు మంచినీళ్ల కటకట వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలోనే రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించింది. రైతులను నిలువునా మోసం చేస్తున్నది. భూ భారతితో ప్రజల ఆస్తులకు రక్షణ కరువైంది. కాంగ్రెస్ నాయకులు, అధికారుల జేబులు నింపుకోవడానికే భూ భారతి పోర్టల్ తెచ్చిండ్రు. ఈ కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో లేదా సిట్ విచారణ జరిపించాలి.
-హరీశ్‌రావు
విలువైన భూములను నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్లు కాగానే తీసేస్తున్నరు. ఇట్లా జాబితాలో పెట్టిన భూములు కోటి ఎకరాలు దాటినయ్. దీని వెనుక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రమేయం ఉన్నది. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత
జాబితాలో పెట్టారో? ఎన్ని తొలగించారో? శ్వేత పత్రం విడుదల చేయాలి.
-హరీశ్‌రావు