రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 28 : (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కార్ హయాంలో సజావుగా నడిచిన వస్త్ర పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ వచ్చిన రెండేండ్లలోనే సంక్షోభంలోకి నెట్టింది. ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడం.. బతుకమ్మ చీరల తయారీని నిలిపివేయడం.. నేతకార్మికుల సంక్షేమ పథకాలను ఆపేయడంతో నేతన్నల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. చేతినిండా పనిలేక, బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో చలించిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కార్మికులను పరామర్శించి, ధైర్యం చెప్పి, ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి, నేతకార్మికులకు పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆందోళనలు చేస్తామని హెచ్చరించడంతో కాంగ్రెస్ సర్కార్ అనివార్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు, బతుకమ్మ చీరల స్థానంలో ఇందిర మహిళాశక్తి చీరల పేరిట ఆర్డర్లు ఇచ్చింది. అయితే ఏటా కోటి మంది మహిళలకు రెండు చీరలు అందిస్తామని ప్రకటించిన సర్కార్, ఆ దిశగా అమల్లో నిర్లక్ష్యం వహిస్తున్నది. మొదటి విడతగా 65 లక్షల చీరల ఆర్డర్లు ఇచ్చి, రెండో విడతగా మరో 35 లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. ఒక చీర ఆర్డర్ మార్చి 5లోగా పూర్తి చేయనున్నారు. కోటి చీరలకు రూ.214 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా, వీటిలో 50 శాతం చెల్లించింది. పెండింగ్ బిల్లులు సుమారు రూ.75 కోట్లకుపైగా ఉండగా ఇతర పెండింగ్ బకాయిలు కలిపి సుమారు రూ.200 కోట్లకు చేరింది. దీంతోపాటు రెండో చీర ఆర్డర్‌పై స్పష్టత లేకపోవడంతో చీరల తయారీ సందిగ్ధంలో పడింది. రెండో చీర ఆర్డర్ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సర్కార్ ఆర్డర్లు ఇవీ..
కాంగ్రెస్ సర్కార్ అనివార్యంగా సమగ్ర శిశు, సంక్షేమ శాఖలకు 2024 మార్చిలో 2025-26 కోసం స్కూల్ యూనిఫామ్ కోసం మరమగ్గాల మ్యాక్స్ సంఘాలకు 112.51 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చింది. అదే విధంగా టెక్స్టైల్ పార్క్‌లోని రాపియర్ మరమగ్గాలకు 52 లక్షల మీటర్ల ఆర్డర్లను కేటాయించింది. అదేవిధంగా ఇందిర మహిళా శక్తి చీరల తయారీ పేరిట రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ఏడాదికి ఉచితంగా 2 ఏకరూప చీరల పంపిణీ చేయాలని మొదటి విడతగా 6.22 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించింది.
ముందుకు సాగని చీరల తయారీ
కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని, బతుకమ్మ చీరల స్థానంలో ఇందిర మహిళా శక్తి పేరిట ఆర్డర్లు ఇచ్చింది. 6.22 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చింది. మొదటి విడతగా 65 లక్షల చీరలకు ఆర్డర్లు అందించారు. ఒక చీర 6.30 మీటర్లు ఉంటుంది. ఇందులో 5.5 మీటర్ల చీర ఉండగా 80 సెంటీమీటర్ల బ్లౌజు ఉంటుంది. ఇప్పటివరకు 4.95 కోట్ల మీటర్ల వస్ర్తోత్పత్తి జరిగింది. ఇటీవలే తయారైన చీరలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రెండో విడతగా 35 లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇది మార్చి 31 వరకు పూర్తి చేయాలని చేనేత జౌళీ శాఖ ఏడీ సంతోష్‌కుమార్ ఆదేశించారు. ఇప్పటికీ ఉన్న వస్ర్తాలే పూర్తికాకపోవడం, కొత్తగా రెండో విడత ఇచ్చిన ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయడం సందిగ్ధంగా మారింది. యజమానులు, ఆసాములు బిల్లులు రాక ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఒక మీటరుకు రూ.34 చొప్పున ఒక చీరకు రూ.214 ప్రభుత్వ చెల్లించాల్సి ఉన్నది.
దీంతో కోటి చీరలకు రూ.214 కోట్లు కాగా, ప్రస్తుతం 65 లక్షల చీరల తయారీ పూర్తయింది. మరో 35 లక్షల చీరలకు ఆర్డర్లు రావడంతో తయారీకి యజమానులు, ఆసాములపై మరింత భారం పడనున్నది. ఇప్పటికే పెట్టుబడి డబ్బులకు వడ్డీల భారం పడినప్పటికీ తయారీని కొనసాగించడం గమనార్హం. దీంతోపాటు 2023-24 సంవత్సరంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్ల బకాయిలు సైతం చెల్లిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. రూ.300 కోట్లను చెల్లించామని చెప్పిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, మరో రూ.75 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ప్రస్తుతం సుమారు రూ.200 కోట్లకుపైగా బకాయిలు ఉండటంతో చీరల తయారీ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరని పరిస్థితి కనిపిస్తున్నది. ఇదిలావుండగా, చీరల తయారీలో నాణ్యత పేరిట చీర సైజు పెంచి, సన్నరకం పోగుల సంఖ్య పెంచడం వల్ల కార్మికులపై భారం పడుతున్నది. బతుకమ్మ చీరల తయారీలో ఇబ్బందులు లేకుండా సాగగా ఇందిరమ్మ చీరల తయారీ కార్మికుల ఆరోగ్యంపై భారం పడుతున్నది. కూలి సైతం పెంచాల్సి ఉండగా కార్మికులకు పాత లెక్క ప్రకారమే మీటరుకు రూ.5 మాత్రమే అందించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కార్మికులు వాపోతున్నారు.
రెండో చీర ఆర్డర్ ఇంకా రాలేదు
ప్రభుత్వం అందించిన ఇందిర మహిళా శక్తి చీరల తయారీ లక్ష్యాన్ని మార్చి 5లోగా పూర్తి చేయాలి. సిరిసిల్లలోని 130 మ్యాక్స్ సొసైటీలకు రెండో విడతగా 35 లక్షల చీరల తయారీకి 2.11 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో ఇప్పటివరకు 1.66 కోట్ల మీటర్ల వస్ర్తాన్ని సేకరించారు. ఇంకా మరమగ్గాలపై 5 లక్షల మీటర్ల వస్త్రం సిద్ధంగా ఉన్నది. మార్చి 5లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి. వస్త్ర ఉత్పత్తిలో వెనుకబడ్డ మ్యాక్స్ సంఘాలను బ్లాక్ లిస్ట్‌లో పెడతాం. రెండో చీర ఆర్డర్ ఇంకా రాలేదు. ప్రస్తుతం చీరల తయారీ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం ఇందిర మహిళా శక్తి చీరల్లో 50 శాతం వరకు చెల్లించాం.
– ఎస్ సంతోష్‌కుమార్, ఏడీ చేనేత జౌళీ శాఖ, సిరిసిల్ల