ఈ బొమ్మలు భలే ఉన్నాయి కదా! ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో ఆరితేరిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన కళాఖండాలివి. ఇంటిని అలంకరించడానికి ఖరీదైన, గొప్ప కళాకారులు తయారు చేసిన కళాఖండాలే అక్కర్లేదు. మీ అందమైన జ్ఞాపకాలే మీ ఇంటిని అలంకరించే గొప్ప కళాకృతులని చెబుతుంది వనిత అంచూరి. కుటుంబం కోసం ఉద్యోగాన్ని వదిలిన సందర్భంలో కాలక్షేపం కోసం మొదలుపెట్టిన అభిరుచి ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో చదవండి.
మా పూర్వికులది వేములవాడ. మాది మంచిర్యాల. బతుకుదెరువు కోసం ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్న. జీవిక కోసం ఇలా ప్రాంతాలు మారినట్టే… సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నా వృత్తులూ మార్చుకుంటూ వచ్చాను. ఎంసీఏ చదివాను. సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. అయిదేళ్లు ఉద్యోగం చేశాను. మా ఆయన కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగే. మాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల ఆలనా, పాలనా దగ్గరుండి చూసుకోవాల్సి రావడంతో నేను ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.
నాకు పాటలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమన్నా ఇష్టం. ఆర్ట్స్ అన్నా క్రాఫ్ట్స్ అన్నా ఇంకా ఇష్టం. పిల్లల కోసం ఉద్యోగం మానేసినప్పుడు కాస్త విరామం దొరికితే చాలు కళల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. అలా రెజిన్ ఆర్ట్‌లో టెక్నిక్స్ నేర్చుకున్నాను. ద్రవ రూపంలో ఉన్న రెజిన్, హార్డ్నర్లను తగుపాళ్లలో కలిపి వాటిల్లో రంగులు పోసి అందమైన రూపాలు వచ్చేలా చేసి, తర్వాత గడ్డకట్టిస్తే నిగనిగలాడుతూ కనిపిస్తుంది. గాజులా పారదర్శకంగా ఉండే రెజిన్లో వర్ణాలు నిశ్చలంగా ఉంటూ ఆకర్షిస్తాయి. పూలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, ఇష్టమైన వస్తువులను రెజిన్ ఆర్ట్తోఅందమైన జ్ఞాపికలుగా మార్చేయవచ్చు. నేర్చుకున్న విద్యతో సృజనాత్మక ఆవిష్కరణలు చేయడం మొదలుపెట్టాను. రెజిన్ ఆర్ట్‌కు దగ్గరగా ఉండే లిప్పన్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాను. మిలమిల మెరుస్తూ ఆకర్షించే ఈ రెజిన్ ఆర్ట్‌కి ఉన్న ఆదరణ తెలిసిన తర్వాత దీనిని కెరీర్‌గా ఎంచుకున్నా. లిప్పన్ ఆర్ట్‌లో మట్టి పాత్రలపై అద్దాలు పేర్చి, అందమైన రంగులు దిద్ది ఆకట్టుకునే డిజైన్లతో ఆకర్షణీయమైన అలంకారాలు తయారు చేయడం మొదలుపెట్టాను. అలా ఈ రెండు కళలతో కొత్త కెరీర్‌ని స్టార్ట్ చేశాను.
కొత్తొక వింత. అలంకరణలో కొత్త వాటికి ఉన్నంత ఆదరణ పాతవాటికి ఉండదు. ప్రజల ఇష్టాలు, ఆదరణకు తగ్గట్టే ‘వైకా ఆర్ట్ స్టూడియో’ పేరుతో కార్యశాలను సిద్ధం చేసుకున్నా. పూర్తి స్థాయిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేకింగ్‌లో మునిగిపోయాను. పెండ్లినాటి పూల దండలు వడలిపోకుండా సంరక్షిస్తూ అందమైన అలంకారంగా మలిచి ఇస్తున్నాను. కాఫీ టేబుల్ టాప్‌లు, వాల్ ఫ్రేమ్‌లు, నేమ్ ప్లేట్లు, కార్పొరేట్ గిఫ్ట్‌లు ఇలా ఏది కావాలంటే అది రెజిన్ ఆర్ట్‌లో తయారు చేస్తున్నాను. అలా ఇళ్లను అలంకరిస్తూ, దవాఖానలు, కేఫ్‌లు, కార్పొరేట్ కార్యాలయాల వరకు నా కళాకృతులు చేరాయి. పిల్లలతో గడపాలనే రోజుల్లో కాలక్షేపానికి మొదలైన ప్రయాణం క్షణం తీరిక లేనంత బిజీగా నా జీవితాన్ని మార్చేసింది. ఆదాయమూ ఘనంగానే ఉంది. అంతకుమించిన సంతృప్తి కలుగుతున్నది.