హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విశ్వనగరం హైదరాబాద్ పతనావస్థకు చేరుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేండ్ల్లలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దామని, కానీ రేవంత్‌రెడ్డి పాతాళానికి తొకేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో హైదరాబాద్ మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారు. పారిశుద్ధ్యం నుంచి ప్రజారవాణా వరకు అన్ని రంగాలు కుప్పకూలాయి’ అని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించి, దిశానిర్దేశం చేశారు. హైడ్రాతో మొదలుపెట్టి, టీడీఆర్ సామ్, పారిశ్రామిక భూముల కేటాయింపు వరకు అన్నింటిలోనూ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు, అనుచరులు వేల కోట్లు దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం తన భూములకు విలువ పెంచుకోవడం కోసమే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్లలో ఎప్పుడూ లేనటువంటి కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు హైదరాబాద్‌లో మళ్లీ దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.
స్వప్రయోజనాల కోసమే ఫ్యూచర్‌సిటీ
రేవంత్‌రెడ్డి అవగాహనరాహిత్యంతో, అక్రమ సంపాదనే లక్ష్యంగా తన భూములకు విలువ తీసుకురావడం కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దిందని గుర్తుచేశారు. అందుకే ప్రజలు రెండు సార్లు హైదరాబాద్ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలు, అవినీతితో నగరాన్ని పూర్తిగా పండబెట్టిందని, తెలంగాణ ఆర్థిక ఇంజన్‌ను కూలగొట్టి, నగరంలో రియల్ ఎస్టేట్‌ను, నగర ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలు అన్నింటినీ కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు. సమావేశంలో జీహెచ్ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జులు పాల్గొన్నారు.