మహబూబాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఇటీవలి భారీ వర్షాలతో మానుకోట కకావికలం అయింది. ఇల్లు, వాకిలి, గొడ్డూగోద ఇలా సర్వం కోల్పోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇంట్లోని సామగ్రి, బియ్యం, ఉప్పులు, పప్పులు, ఇతర సామగ్రి అంతా వరద నీటిలో తడిసిపోయి తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు.
ఇళ్లల్లో ఉండలేక, నిత్యావసర సరుకులు ఇచ్చినా వంట చేసుకొనే వీలు లేక తండ్లాడుతున్నారు. అంతేగాక వేలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయి రైతన్నలు లబోదిబోమంటున్నారు. సుమారు 27వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు సమాచారం. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొనగా వరదలతో దెబ్బతిన్న గ్రామాల్లో జరిగిన నష్టంపై జిల్లా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యుత్‌రంగం పూర్తిగా దెబ్బతిన్నది. వరదలు వచ్చిన గ్రామాల్లో రెండు మూడు రోజులకు కానీ కరెంట్ తీయలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వరదల కారణంగా జిల్లావ్యాప్తంగా 700విద్యుత్ స్తంభాలు విరిగిపోయా యి. 106 ట్రాన్ఫ్‌ఫార్మర్లు పాడైపోయాయి. దీం తో సంస్థకు రూ.35 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
జిల్లావ్యాప్తంగా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరద తాకిడికి వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. 27,544 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి 16,810 ఎకరాలు, పత్తి 5764 ఎకరాలు, మకజొన్న 2798, ఇతర పంటలు 2172 ఎకరాల్లో నష్టం జరిగింది.
వరదల కారణంగా జిల్లావ్యాప్తంగా పశువులకు భారీ నష్టం వాటిల్లింది. ఇందులో గొర్రెలు, బర్రెలు, ఆవులు అన్నీ కలిపి 215 మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. పశు నష్టం ఎకువగా ఉండడంతో రైతులకు మరింత ఆందోళనకు గురిచేసింది.
వరద తాకిడికి కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరు వాగులో కారు, మహబూబాబాద్‌లోని రాళ్లవాగులో డీసీఎం కొట్టుకుపోయింది. ఇవి కాకుండా సీతారాంతండా, నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో సుమారుగా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. మానుకోటకు కలిగిన నష్టం కష్టం అంతా ఇంతా కాదు. కోలుకోవాలంటే ఎంతో వ్యయంతో పాటు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అతి భారీ వరదలకు జిల్లాలో పలు గ్రామాలతో పాటు కాలనీలు అతలాకుతలం అయ్యా యి. జిల్లా లో నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మం డలం సీతారాంతండా, తేజావత్ తండా, భూక్యతండాలో నీట మునిగాయి. మరో 15 గ్రామాలు, 100కు పైగా కాలనీలో వరద నీరు వచ్చి చేరింది.